సిటీబ్యూరో, ఆగస్టు 30(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని దెబ్బతీశాయి. కొత్త ఫ్లాట్లు, ప్లాట్లు అమ్మకాలు దేవుడెరుగు, ఉన్న పాత ఆస్తులను అమ్ముకుందామన్నా వీల్లేకుండా మార్కెట్‌ను అతలాకుతలం చేస్తోంది. పైగా 22ఏ నిషేధిత భూముల జాబితా నిబంధనల ఉచ్చు, స్పష్టత లేని విధానాలతో రీసేల్ సెగ్మెంట్ అట్టడుగుకు నెట్టేసింది. ఇప్పటికే మందగమనంతో ఉన్న రియల్ రంగానికి కాంగ్రెస్ వ్యవహార శైలి మూలిగే నక్కపై తాటికాయ పడిన చందంగా మారిందని రియల్ వ్యాపారులు ఆగహం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ ఉద్యోగం చేసుకునే రాహుల్ ఐదేళ్ల కిందట పటాన్ చెరు సమీపంలో కొన్న ఫామ్ ల్యాండ్ ప్లాట్‌కు రెండేళ్ల కిందట వరకు బై బ్యాక్ ఆఫర్ పేరిట వెంట పడ్డారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చిన నాటి నుంచి మొదలైన మార్కెట్ డౌన్ ఫాల్… నిబంధనల పేరిట సృష్టిస్తున్న గందరగోళంతో ఇప్పుడు అత్యవసరమై అమ్ముకునే అవకాశమే లేకుండా చేసిందని వాపోతున్నారు. ఇదీ ఒక్క రాహుల్‌కు ఎదురైన ఘటనే కాదు… ఇలాంటి ఎంతో మంది ఇప్పుడు కాంగ్రెస్ చర్యలతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నారు. ఉన్న ఆస్తులను సొమ్ము చేసుకునే వీల్లేకుండా కావడంతో ఆర్థిక అవసరాలకు ఉన్న ఆస్తులు అక్కరకు రాకుండా పోతున్నాయని వాపోతున్నారు.
నిర్ణయాలు ఎంతలా ప్రభావితం చేశాయంటే… అవసరానికి ఉన్న ఇంటిని అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశం లేకుండా చేసింది. మార్కెట్లో క్రయవిక్రయాలు తగ్గిపోవడంతో..ఎమర్జెన్సీ పేరిట కొనుగోలుదారులు అడ్డికి పావుసేరులా సగం ధరకే అడుగుతున్నారు. విద్యానగర్‌కు చెందిన వ్యాపారి చంద్రకాంత్ తన వ్యాపార అవసరాల కోసం రెండో ఇంటిని బేరానికి పెట్టగా… తన అవసరాన్ని సొమ్ము చేసుకునే లక్ష్యంతో… ప్రస్తుత మార్కెట్ స్థితిని సాకుగా చూపెట్టి సగానికి కంటే తక్కువ రేటులో కొనుగోలు చేస్తామంటూ ముందుకు వచ్చారు. అగ్గువ ధరకే తన కోటిన్నర ఇంటిని అమ్ముకోవడం ఇష్టం లేక… బ్యాంక్‌లో మిగిలిన అప్పును తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారు. ఇలా చంద్రకాంత్ లాంటి ఎంతోమంది భూ యజమానులకు ఇలాంటి పరిస్థితులే ఎదురవుతుండగా… ప్రజల్లో తీవ్ర భయాందోళనలతో బేజారవుతున్నారు.
హైడ్రా పేరిట సృష్టించిన భయాలు, 22ఏ పేరిట దూసుకువచ్చిన సంక్షోభం రియల్ ఎస్టేట్ రంగాన్ని చావు దెబ్బ కొడుతున్నాయి. చెరువుల సంరక్షణ పేరిట బఫర్ జోన్లు అం టూ పేదల ఇండ్లపైకి దూసుకువచ్చిన బుల్డోజర్లను చూసి ఇప్పటికీ భయపడిపోతున్నారు. ఇప్పుడు నిషేధిత జాబితా పేరిట జరుగుతున్న విధ్వంసం మార్కెట్‌ను అతలాకుతలం చేస్తుందంటున్నారు. అనుమతులు ఉన్న లే అవుట్లు, దశాబ్ధాలు గడిచిన అపార్టుమెంట్లను కూడా రాత్రికి రాత్రే నిషేధిత జాబితాలో పెట్టడంతో… అవసరానికి అమ్ముకోలేక, అడ్వాన్స్‌లు తీసుకోని కూడా రిజిస్ట్రేషన్లు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. ఇక రీసేల్ ఆస్తులకు రుణా లు ఇచ్చేందుకు బ్యాంకులు కూడా వెనకాడుతుండటంతో మధ్యతరతిగి విక్రయదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులో కూరుకుపోతున్నారు. ఇదే విషయాన్ని నైట్ ఫ్రాంక్, అనరా క్, ప్రాప్ టైగర్ వంటి ప్రముఖ సంస్థల నివేదికలు కూడా నగరంలో రీసేల్ మార్కెట్ కుప్పకూలిందనీ స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం వేలం పాటల తప్పుడు లెక్కలతో జనాలను మభ్యపెట్టాలని చూస్తున్నా, క్షేత్రస్థాయిలో సగటు పౌరుడు తన సొంత ఆస్తిని అమ్ముకోలేక అల్లాడిపోతున్నారు.