ఎల్బీనగర్, నవంబర్ 30: వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని బైరామల్‌గూడ జంక్షన్‌కు కొత్త అందాలు సంతరించుకుంటున్నాయి. ఇప్పటికే ఇన్నర్ రింగ్‌రోడ్డులో ఇరువైపులా ట్రాఫిక్ చిక్కులు లేకుండా సాఫీగా ప్రయాణానికి రెండు ఫ్లైఓవర్లు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా బైరామల్‌గూడ జంక్షన్లో రెండవ లెవల్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానున్నది. ఇదే అందుబాటులోకి వస్తే ఫ్లైఓవర్ పై నుంచి మరో ఫ్లై ఓవర్‌తో ఈ జంక్షన్‌కు మరింత శోభ చేకూరుతుంది.
బైరామల్‌గూడా జంక్షన్లో ఇప్పటికే రెండు ఫ్లై ఓవర్లు 6 మీటర్ల ఎత్తులో నిర్మించారు. ఎయిర్‌పోర్టు నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు ద్వారా విజయవాడ వైపు వెళ్లే వారికి, సాగర్ రింగ్ రోడ్డు వైపు వెళ్లేవారికి బైరామల్‌గూడ జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఇక్కట్లు లేకుండా ఉండేందుకు రూ. 137.05 కోట్లతో రెండవ లెవల్ ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నారు. రూ. 70.75 కోట్ల నిర్మాణ వ్యయంతో మొత్తం 42 పిల్లర్లతో 1700 మీటర్ల పొడవుతో ఈ ఫ్లైఓవర్ నిర్మితమవుతోంది. ఈ రెండవ లెవల్ ఫ్లై ఓవర్ అత్యధికంగా 21 మీటర్ల ఎత్తు కాగా, బైరామల్‌గూడా జంక్షన్లో 15 మీటర్లకు పైగా ఎత్తు ఉంటుంది. నగరంలో రెండవ లెవల్ ఫ్లై ఓవర్ ఇప్పటికే బయోడైవర్సిటీ జంక్షన్లో నిర్మితం కాగా, రెండవదిగా బైరామల్‌గూడ జంక్షన్లో అవిష్కృతం అవుతోంది. 2021చివరలో ప్రారంభమైన ఈ రెండవ లెవల్ ఫ్లైఓవర్లో 42పిల్లర్లకు గాను ఇప్పటికే అలేఖ్య టవర్స్ నుంచి బైరామల్‌గూడ రోడ్లో 19 పిల్లర్లు పూర్తి చేశారు. చింతలకుంట అండర్‌పాస్ రోడ్డులో 10 పిల్లర్లు పూర్తయ్యాయి.
వై ఆకారంలో ఫ్లైఓవర్..
ఇన్నర్ రింగ్‌రోడ్డులోని అలేఖ్య టవర్స్ నుంచి ఆరంభమయ్యే రెండవ లెవల్ ఫ్లై ఓవర్ బైరామల్‌గూడా జంక్షన్ వద్దకు చేరుకున్నాక రెండు వైపులా ‘వై’ ఆకారంలో విడిపోయి ఒకటి సాగర్ రింగ్‌రోడ్డు హస్తినాపురం వైపు, మరొకటి చింతలకుంట అండర్‌పాస్ వైపు విజయవాడ రహదారికి నేరుగా వెళ్లేలా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగంగా కొనసాగుతున్నాయి.