బంజారాహిల్స్,మే 10: విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) అనే మహిళ గతంలో బెంగళూరులో భర్తతో కలిసి నివా సం ఉండేదని పోలీసులు గుర్తించారు. నేపాలీ గ్యాంగ్ స్కెచ్‌లో భాగంగానే కల్పన హైదరాబాద్‌కు వచ్చిందని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన కాల్‌డేటాను విశ్లేషించిన పోలీసులకు బెంగళూరులోని ఆమె భర్తగా పేర్కొంటున్న వ్యక్తితో ఎక్కువగా మాట్లాడిందని, అతడితో పాటు మరికొంతమంది వ్యక్తులతో సైతం ఫోన్లో మాట్లాడినట్లు తేలింది. వారందరిపై పోలీసులు నిఘా పెట్టారు. నగరంలో కల్పనను ఉద్యోగంలో నియమించిన వ్యక్తులను సైతం అదుపులోకి తీసుకుని వివరాలు సేకరిస్తున్నారు.
కల్పన తల్లిదండ్రులు పూణేలో నివాసం ఉంటారని గుర్తించిన పోలీసులు వారిని సైతం ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది. నేపాల్ సరిహద్దులు దాటేందుకు యూపీలోని మూడు ప్రాంతా ల్లో అవకాశం ఉండగా, అక్కడకు ఇప్పటికే చేరుకున్న పోలీసులు వారికోసం కాపు కాస్తున్నారు. కాగా తనూజరంజన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన వైద్యులు ప్రాథమిక నివేదిక అందజేసినట్లు తెలుస్తోంది. నేపాల్‌లో ఉంటూనే భారత్‌లో వందలాదిమంది నేపాలీ వ్యక్తులను పావులుగా వాడుకుంటూ చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు విదేశీ వ్యవహారాలశాఖ సాయం తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.