సుల్తాన్ బజార్, జూలై 17: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు డిమాండ్ చేశారు. గురువారం నిజాం కళాశాలలో నిర్వహించిన ఓ అవగాహన కార్యక్రమానికి హాజరవుతున్న తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. నిజాం కళాశాల ప్రధాన ద్వారం వద్ద ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలంటూ ప్లకార్డులను ప్రదర్శించడంతో పాటు రోడ్డుపై బైఠాయించారు. భట్టి కాన్వాయ్‌ను కూడా అడ్డుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రియింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారన్నారు. భట్టి కాన్వాయ్‌ను ఏబీవీపీ నేతలు, విద్యార్థులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలర్టైన పోలీసులు విద్యార్థులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి
మారేడ్‌పల్లి, జూలై 17:రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రూ.8,300 కోట్ల స్కాలర్షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సికింద్రాబాద్ పీజీ కళాశాల గేటు ఎదుట అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ సికింద్రాబాద్ జిల్లా కన్వీనర్ చెర్క బాలు మాట్లాడుతూ.. స్కాలర్షిప్ అనేది ప్రభుత్వ భిక్ష కాదని, విద్యార్థుల హక్కు అని అన్నారు.
రాష్ట్రంలోని వేలాది మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు స్కాలర్షిప్ అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఫీజుల కట్టలేని స్థితిలో ప్రైవేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయన్నారు. బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎస్ఎఫ్డీ సిటీ కన్వీనర్ పాండురంగ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శ్వేత, సెక్రటరీలు పవన్, అభి, ఇతర ఏబీవీపీ నాయకులు శ్రీకర్, రామ్, కృష్ణ, అజయ్, భాను, శ్రీరామ్, అలోక్ తదితరులు పాల్గొన్నారు.