సుల్తాన్‌బజార్, డిసెంబర్ 11 : సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి దవాఖానకు నిత్యం వందలమంది గర్భిణులు ఓపీకి వస్తుంటారు. ఇన్పేషెంట్లుగా ఉన్న గర్భిణులు, బాలింతలకు ఇబ్బందులు కలుగకుండా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ కె.రాజ్యలక్ష్మి పూర్తిస్థాయి లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. లేబర్‌వార్డు, ఆ పరేషన్ థియేటర్, వార్డులు, ఓపీ బ్లాక్‌తో పాటు పై కప్పులపై చెత్తాచెదారాన్ని పారిశుధ్య కార్మికులు ఎప్పటికప్పు డు తొలగిస్తున్నారు. నిత్యం దవాఖాన పరిసరాల్లో చెత్తాచెదారం లేకుండా చూస్తున్నారు. దవాఖానలో డ్రైనేజీలు పొంగి పొర్లితే జీహెచ్ఎంసీ సిబ్బంది రాకకోసం వేచి ఉండక సిబ్బంది జాగ్రత్తలు తీసుకొని పరిశుభ్ర పర్చడం గమన్హారం.
గర్భిణులకు ఇబ్బందులు కలుగకుండా ..
కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో అతి సున్నితంగా ఉండే గర్భిణులకు ఇబ్బందులు కలుగకుండా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజ్యలక్ష్మి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. గర్భిణులు, రోగి సహాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం దవాఖానలోనే అన్ని రకాల రక్త పరీక్షలను చేసే విధంగా అత్యాధునియక యంత్రాలను సమకూర్చారు. ఈ యంత్రంతో ఒకే సమయంలో 150 మందికి పరీక్షలను నిర్వహించవచ్చని ఆమె తెలిపారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అత్యాధునిక యంత్రాలు అందుబాటులోకి తీసుకురావడంతో సంతోషం వ్యక్తం చేశారు.
నిత్యం పరిశుభ్రతా చర్యలు..
లేబర్ రూం, వార్డులతో పాటు ఆవరణలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకుంటున్నారు. తాగునీటి ట్యాంకులను అత్యాధునిక యంత్రాలతో పరిశుభ్రపరుస్తున్నారు. రోగి సహాయకులు, రోగులకు అసౌకర్యం కలుగకుండా సూపరింటెండెంట్ డాక్టర్ కె. రాజ్యలక్ష్మి సిబ్బందికి సూచనలు చేస్తున్నారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే.. రోగాలు దరి చేరవు
పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంటేనే రోగాలు దరిచేరవు. దీనిని దృష్టిలో ఉంచుకొని దవాఖానలో నిత్యం పరిశుభ్రతా చర్యలు చేపడుతున్నాం. రోగి సహాయకులు కూడా డస్ట్బిన్లను ఉపయోగించాలి. సిబ్బంది పర్యవేక్షిస్తున్నా..అందరి సహకారం అవసరం. రెండుసార్లు దవాఖాన ఆవరణను రసాయనాలతో పరిశుభ్ర పరుస్తున్నాం.
– డాక్టర్ కె.రాజ్యలక్ష్మి, దవాఖాన సూపరింటెండెంట్
కార్పొరేట్ తరహాలో పారిశుధ్య చర్యలు
ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ తరహాలో పరిశుభ్ర పర్చడం ఆనందంగా ఉన్నది. ప్రభుత్వ దవాఖానకు రావాలంటేనే ఇబ్బందిగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేటర్ తరహాలో రెండు సార్లు పరిశుభ్ర పర్చడం ఆనందంగా ఉంది. గతంలో కంటే ప్రస్తుతం దవాఖానకు రావడానికి సంతోషంగా వస్తున్నాం.
– పావని భూపేశ్ గుప్తా, సహాయకురాలు