GHMC | సిటీబ్యూరో : గ్రేటర్లో పారిశుధ్య నిర్వహణ గాడి తప్పుతున్నది. చెత్త రహిత నగరంగా తీర్చిదిద్దాల్సిన జీహెచ్ఎంసీ అమలులో పూర్తిగా విఫలమవుతున్నది. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ, వ్యాధుల నివారణకు ఏటా రూ.300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నా..లక్ష్యాన్ని మాత్రం సాధించలేకపోతున్నది. ఇంటింటికీ తడి, పొడి చెత్త సేకరణ, తరచూ చెత్త వేసే ప్రాంతాల (గార్భేజీ వనరేబుల్ పాయింట్లు/జీవీపీ) ఎత్తివేతలో అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతున్నది. గ్రేటర్ వ్యాప్తంగా చెత్త డబ్బాలను ఎత్తి వేయగా..ఇప్పటికీ 2640 చోట్ల చెత్త కుప్పలున్నట్లు అస్కి (అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియా) సర్వేలో తేలడమే అధికారుల పనితీరును ప్రశ్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఎక్కడా చూసినా పెద్ద పెద్ద చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. వ్యర్థాలతో నిండిపోయిన బస్తీలు, కాలనీలు వెరసి దోమలతో దవాఖానల్లో పెరుగుతున్న వ్యాధి పీడితులతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. దీనికి కారణం అడుగడుగునా కొందరు అధికారుల అవినీతి లెక్కలు, రికార్డుల్లో తప్ప క్షేత్రస్థాయిలో కనిపించని సిబ్బంది.. కాగితాల్లో మాత్రమే కనిపించే చెత్త తరలింపు.. మేయర్, డిప్యూటీ మేయర్, కమిషనర్ మొదలుకొని డిప్యూటీ కమిషన్ల వరకు ఆకస్మిక పర్యటనల లేమి వరకు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి.
జీహెచ్ఎంసీ మళ్లీ డస్ట్ బిన్ల తరహాలో స్వీపింగ్ వేస్ట్ కలెక్షన్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నది. రేకులతో దుకాణం మాదిరిగా షెడ్డు ఏర్పాటు చేసి అందులో చెత్త వేస్తే బయటకు కనిపించకుండా ఉండేలా ఏర్పాటు చేస్తున్నది. అక్కడి నుంచి గార్భేజ్ వెహికల్స్‌లో చెత్తను ట్రాన్స్ఫర్ స్టేషన్లకు తరలించనున్నారు. గ్రేటర్‌లోని 150 డివిజన్లలో ఒక్కొక్క పాయింట్ ఏర్పాటు చేయనున్నారు. తొలుత బస్తీలు, ఆ తర్వాత కాలనీల్లోని ముఖ్య కూడళ్లలో ఈ చెత్త సేకరణ పాయింట్ల ఏర్పాటుతో పారిశుధ్య నిర్వహణ, మెరుగైన ర్యాంకింగ్ సవాల్‌గా మారనున్నది.
గార్భేజ్ ఫ్రీ సిటీయే లక్ష్యమని జీహెచ్ఎంసీ చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఉప్పల్ చిలుకానగర్ నుంచి నాచారం మెయిన్ రోడ్, కవాడిగూడ ప్రధాన రహదారి, బన్సీలాల్‌పేట, ముషీరాబాద్, షేక్‌పేట దర్గా, ఓయూ కాలనీలో రహదారుల పక్కనే చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేసేస్తున్నారు. మాదాపూర్ కావూరి హిల్స్ ప్రధాన రహదారి, పర్వత్నగర్తో పాటు పాతబస్తీలోని 70 శాతం ప్రాంతాల్లో అపరిశుభ్రత తాండవిస్తున్నది. చార్మినార్ నుంచి గుల్జార్ హౌస్ వెళ్లే దారిలో చెత్త కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఎర్రగడ్డ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో కుప్పలు కుప్పలుగా చెత్త, ఇతర వ్యర్థాలతో భరించలేని దుర్వాసన వస్తున్నదని స్థానికులు చెబుతున్నారు. జోనల్, డిప్యూటీ కమిషనర్లు నిత్యం పరిధిలో పర్యటించాలి. కానీ అదెక్కడా జరగడం లేదు. జోనల్ కమిషనర్లు పెద్దగా పట్టించుకోకపోవడంతో చాలా మంది డిప్యూటీ కమిషనర్లు మధ్యాహ్నం తర్వాత కార్యాలయాలకు వస్తున్నారు. పారిశుధ్య విభాగంలోనూ కొందరు సక్రమంగా విధులకు రావడం లేదనే ఆరోపణలు లేకపోలేదు.
గ్రేటర్లో చెత్తరహిత నగరంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా దాదాపు మూడున్నరేండ్ల కిందట డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో చెత్త కుండీలను జీహెచ్ఎంసీ ఎత్తేసింది. వందకు వంద శాతం ఇంటింటి చెత్త సేకరణకు స్వచ్ఛ ఆటోల సంఖ్యను పెంచారు. సుమారు 5,250 స్వచ్ఛ ఆటోల ద్వారా నగరంలో 4,886 కాలనీల్లో 23 లక్షల గృహాల నుంచి రోజుకు 7వేల మెట్రిక్ టన్నులకు పైగా చెత్త సేకరణ జరగాలి. ఒకొక ఆటోకు కాలనీ వారీగా చూస్తే ఒకటి లేదా రెండు కాలనీలు గృహాల ప్రకారంగా గమనిస్తే ఒకొక అటోకు సుమారుగా 500 నుంచి 600 ఇండ్లను కేటాయించి, చెత్త సేకరణ జరపాలి. కానీ గడిచిన కొన్ని రోజులుగా స్వచ్ఛ ఆటోల పనితీరు సరిగా ఉండటం లేదు. చాలా కాలనీలకు రోజూ స్వచ్ఛ ఆటోలు రావడం లేదు. వందకు వంద శాతం స్వచ్ఛ ఆటోల అటెండెన్స్ ఉండడం లేదు. రోజూ 1000 స్వచ్ఛ ఆటోలు పనిచేయడం లేదని స్వయంగా గత కమిషనర్ రోనాల్డ్ రాస్ గుర్తించారు. నేటికీ స్వచ్ఛ ఆటోల పనితీరుపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించింది. దీంతో ఎక్కడి చెత్త అక్కడే పేరుకుపోతున్నది.