సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : రోడ్లు తెరవాలని కంటోన్మెంట్ వాసులు ఎంతగా వేడుకుంటున్నా కేంద్రం మాత్రం బెల్లంకొట్టిన రాయిలా ఉలుకూ పలుకూ చేయడం లేదు. దేశవ్యాప్తంగా పలు కంటోన్మెంట్ బోర్డు పరిధుల్లోని రోడ్లను తెరవాలని, ఆ మేరకు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని సెంట్రల్ డిఫెన్స్ ఎస్టేట్ అదనపు డైరెక్టర్ జనరల్ (కంటోన్మెంట్) 2018, మే 31న లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారు.
ఇందులో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అధికారులు ఇక్కడ ఉన్న అమ్ముగూడ, ఆల్బెయిన్, ఎంపైర్, ప్రొటినీ, రిచర్డ్‌సన్‌తో పాటు ఆరు ప్రధాన రోడ్లను కూడా తెరవాల్సి ఉంది. కానీ బోర్డు అధికారులు వాటిని తెరవకపోవడంతో ఏండ్ల తరబడిగా వాహనదారులు, చుట్టుపక్కల ప్రాంతాల్లోని సామాన్య జనం నిత్య నరకం అనుభవిస్తున్నారు. సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఈ విషయం తెలిసినా పట్టించుకోవడం లేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ ఇన్నాళ్లూ ఆరు రోడ్లను మూసివేసిన కంటోన్మెంట్ బోర్డు అధికారులు.. గత ఏడాది అక్టోబరు 18న ప్రజాభిప్రాయ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. 21 రోజుల్లో ప్రజలు తమ అభిప్రాయాలు చెప్పాలని అందులో కోరారు. అనంతరం వారం రోజుల వ్యవధిలోనే అంటే అక్టోబరు 25న మరో నోటిఫికేషన్ జారీ చేశారు. అందులోనూ ఇవే ఆరు రోడ్ల మూసివేతపై అభిప్రాయం చెప్పాలంటూ 21 రోజుల గడువు ఇచ్చారు.
వెల్లువలా ప్రజాభిప్రాయం
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని ఈ ఆరు రోడ్లనే కాదు.. తరచూ మూసివేసే రోడ్లను శాశ్వతంగా తెరవడంతో పాటు తిరుమలగిరిలోని డంపింగ్ యార్డును సైతం అక్కడి నుంచి తరలించాలని ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రజలు బోర్డుకు తమ అభిప్రాయాలను లిఖితపూర్వకంగా తెలిపారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు మర్రి రాజశేఖర్‌రెడ్డి, టీఎస్ఎండీసీ చైర్మన్ క్రిశాంక్, తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోస్టుకార్డు ఉద్యమమే కొనసాగింది. లక్షలాది మంది ప్రజలు పోస్టుకార్డుల ద్వారా తమ అభీష్టాన్ని వ్యక్తం చేశారు.
దీంతో సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలు సైతం ఆ రోడ్లను తెరవాలంటూ లిఖితపూర్వకంగా డిమాండ్ చేశారు. ఇలా 21 రోజుల పాటు వెల్లువలా ఈ ఉద్యమం కొనసాగింది. కాగా గడువు ముగిసి రెండు నెలలు దాటింది. కానీ ఇప్పటివరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ, కంటోన్మెంట్ బోర్డు నుంచి ఉలుకూ పలుకూ లేదు. రోడ్లను తెరవాలనే ప్రజాభీష్టాన్ని ఉద్దేశపూర్వకంగా కేంద్రం తొక్కిపెట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో త్వరలో జరుగనున్న కంటోన్మెంట్ బోర్డు సమావేశంలోనైనా ప్రజల కష్టాలను తీర్చేలా రోడ్లను తెరిచే నిర్ణయాన్ని ప్రకటించాలని ప్రజలు కోరుతున్నారు.