బాసు చెప్పేదెప్పుడు..మోక్షం కలిగేదెప్పుడు..అన్నట్లు తయారైంది హెచ్ఎండీఏలో ఫైళ్ల కథ. ప్రభుత్వ పెద్దలు చెబితే తప్ప..నెలలు గడిచినా..దస్ర్తాలు కదలడం లేదు. రాజు తలుచుకుంటే రాజ భోగాలకు ఢోకా ఉండదనే మాటను హెచ్ఎండీఏ అధికారులు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. రాజు చెప్పడమే ఆలస్యం… ఏ కారణంతోనైనా పెండింగ్‌లో ఉన్న ఫైల్.. చెప్పిన గడువులోగా క్లియర్ కావాల్సిందే.
అందుకు అధికారులే ప్రత్యేక రూట్ మ్యాప్‌తో ఫైల్స్ క్లియరెన్స్ కోసం ఆరాటపడుతున్నారనే చర్చ నడుస్తోంది. ఎంఎస్బీ, ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, ఎన్వోసీ, బిల్డింగ్ పర్మిషన్ల విషయంలో తలెత్తే వివాదాల విషయంలో హెచ్ఎండీఏ వేదికగా జోరుగా పైరవీలు సాగుతున్నాయి. ముఖ్యంగా ప్లానింగ్ విభాగంలో ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన అధికారులు ఈ విషయంలో మరింత వేగంగా స్పందిస్తున్నారు. రెఫరెన్స్ రావడమే తరువాయి అన్నట్లు కమిషనర్‌తో నేరుగా ఫైళ్లపై చర్చించేంత చొరవ తీసుకొని.. వ్యవహారాలను చక్కబెడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
గతంలో పూర్తి స్థాయి కమిషనర్ లేకపోవడంతో పర్మిషన్ల విషయంలో జాప్యం జరుగుతున్నదని కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలు చేశారు. అయితే హెచ్ఎండీఏకు పూర్తి స్థాయి కమిషనర్‌గా సర్ఫరాజ్ అహ్మద్ బాధ్యతలు తీసుకుని మూడు నెలలు గడుస్తున్నా… సంస్థ పాలనపై పట్టు సాధించలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ పెద్దలు, లేదా పురపాలక శాఖ ఉన్నతాధికారులు చెబితే తప్ప.. ఫైల్స్ విషయంలో స్పందించడం లేదని సమాచారం. కింది స్థాయి అధికారులు కూడా తమకొచ్చిన బాధ ఎందుకని.. దరఖాస్తుదారులు వస్తే.. ఉన్నతాధికారుల పేరు చెప్పి.. తప్పించుకోవడమనేది ఆనవాయితీగా మారుతున్నది.
హెచ్ఎండీఏలో అవినీతిరహిత పాలనపరమైన అంశాలకు పెద్ద పీట వేసేలా గతంలో టీఎస్‌బీపాస్ వంటి ఆన్లైన్ మాధ్యమాలను ప్రవేశపెట్టారు. దాదాపు ఆన్లైన్ వేదికగా పారదర్శకంగా పనులు జరిగేలా ఐటీ విభాగాన్ని బలోపేతం చేశారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆఫీస్ పనితీరులో మార్పులు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ముఖ్యంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నా… ఫైల్ స్టేటస్ అప్డేట్ కాకుండా ఉంచడం, ఫైల్ పురోగతి, షార్ట్ ఫాల్ విషయంలో అంశాల కోసం కార్యాలయాల కోసం రావాల్సి వస్తున్నదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. ఇక హెచ్ఎండీఏకు ఆదాయం సమకూర్చే ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్, ఎన్వోసీతోపాటు, బిల్డింగ్ పరిష్మన్ల విషయంలోనైతే ఉన్నతాధికారులకు సిఫార్సు చేస్తేనే.. ఫైల్ ముందుకు కదలుతున్నదనే విమర్శలున్నాయి. ఈ క్రమంలో కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 260కిపైగా ఫైళ్లు ఆయన వద్దే మూలుగుతున్నాయని తెలిసింది
. కమిషనర్ వద్దే పెండింగ్‌లో ఉండటంతో కింది స్థాయి అధికారులు కూడా అటు వైపు చూసే పరిస్థితి లేదని, ఏదైనా ఫైల్‌కు సంబంధించి ప్రభుత్వ పెద్దల సిఫార్సులు ఉంటే తప్ప.. పని పూర్తయ్యే పరిస్థితి లేదని పలువురు బాధితులు వాపోతున్నారు. ఇక మున్సిపల్ శాఖను కూడా సీఎం రేవంత్‌రెడ్డి చూస్తుండటంతో ఫైళ్ల విషయంలో ఆచితూచి స్పందించి, క్లియరెన్స్ ఇస్తున్నారని, ఏదైనా నోట్ ఫైల్ ఉంటే గానీ దస్ర్తాలు ముందుకు కదిలే పరిస్థితి లేదని, కనీసం మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిర్వహించే విజిటింగ్ అవర్‌లోనూ కమిషనర్‌ను కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదని పలువురు వాపోతున్నారు. ఇక అధికారులు కూడా విజిటింగ్ అవర్స్ పేరిట కాలయాపన చేస్తుండగా.. నిర్ణీత సమయంలో వెళ్లినా… సంబంధిత అధికారులు రిఫరెన్స్ ఇస్తే గానీ పెండింగ్ దరఖాస్తులపై చర్యలు తీసుకోలేకపోతున్నారు.