గ్రేటర్ రోడ్లపై ఐఆర్సీ (ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్) ప్రమాణాలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్‌తో నడుము, మెడ, మోకాళ్ల నొప్పులు, డిస్క్ అరుగుదలతో నరంపై ఒత్తిడి ఇలా అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే పౌరుల నుంచి తీవ్ర స్థాయిలో రంబుల్ స్ట్రిప్స్‌పై వ్యతిరేకత రావడం, నెటిజన్లు మండిపడుతుండడం దృష్ట్యా గ్రేటర్ రహదారులపై ఐఆర్సీ ప్రమాణాలు ఏ మేర ఉన్నాయి? రంబుల్ స్ట్రిప్స్ డెంజర్గా ఉన్నాయా? జీబ్రా క్రాసింగ్, పాదచారుల భద్రత ఇతర అంశాలపై జీహెచ్ఎంసీ ఇటీవల అధ్యయనం చేసింది. రంబుల్ స్ట్రిప్స్, సైనేజ్, మార్కింగ్లతో పాటు ట్రాఫిక్ సంబంధిత పనులపై అధ్యయనం చేసిన అధికారులు ఐఆర్సీ నిబంధనలు అనుసరించి స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసిజర్ (ఎస్వోపీ)ను అమలు చేయాలని సూచించింది.
సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ) : స్పీడ్ బ్రేకర్లతో ప్రమాదాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుల నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నాయంగా జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన రంబుల్ స్ట్రిప్స్ ప్రయాణికులకు వె న్నులో వణుకు పుట్టిస్తున్నాయి. ఇండియన్ రోడ్ కాంగ్రెస్(ఐఆర్సీ) ప్రమాణాలను ఉల్లంఘిస్తూ ఇష్టారీతిన వీటిని ఏర్పాటు చేశారు. ఇండియన్ రోడ్స్ కాంగ్రెస్ (ఐఆర్సీ) మార్గదర్శకాల ప్రకారం, జాతీయ, రాష్ట్ర రహదారులపై రంబుల్ స్ట్రిప్స్ ఎత్తు 5 మిల్లీ మీటర్లు 300 మిల్లీ మీటర్ల వెడ ల్పు, 600 మిల్లీమీటర్ల స్పేస్, ఆరు స్ట్రిప్‌తో ఉండాలి. పోలీస్ శాఖ ఆదేశాలతో మేరకు చాలా చోట్ల రహదారులపై 10, 15 ఎంఎం మందంతో ఉన్నాయి.
అడుగుకు ఒకటి చొప్పున ఒకో ప్రాంతంలో ఆరు స్ట్రిప్స్ మాత్రమే ఉండాలి. కానీ చాలా ప్రాంతాల్లో 7.5 నుంచి 10 మిల్లీమీటర్ల మందంతో రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకువ మందం, రెట్టింపు స్ట్రిప్స్‌తో కుదుపునకు గురవుతుండడంతో వాహనాలతోపాటు పౌరుల ఆరోగ్యం పాడవుతుందని, కార్యాలయాల్లో కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లపై, ఎకువ సమయం కూర్చొని ఇతరత్రా పనులు చేసే వారిలో చాలామంది స్పాండిలైటిస్, వెన్నువొప్పి వంటి సమస్యలతో బాధపడుతుంటారని, ఇలాంటి వారికి రంబుల్ స్ట్రిప్స్‌తో ఇబ్బందులు అధికమవుతాయని వైద్యులు, పౌరుల నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.
అత్యధికంగా బంజారాహిల్స్ రోడ్ నెంబర్ -3లోని ఓ మసీద్ వద్ద, పంజాగుట్ట నుంచి బేగంపేట వైపు వెళ్లే మార్గంలో, హబ్సిగూడ, మెహిదీపట్నం, నిజాం కాలేజీ హాస్టల్ నుంచి సీసీఎస్, అసెంబ్లీ వద్ద, ఐఎస్బీ రోడ్లో రంబుల్ స్ట్రిప్స్‌పై అత్యధికంగా ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలోనే. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు రోజురోజుకు విరుచుపడుతుండడంతో ఎట్టకేలకు జీహెచ్ఎంసీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. కొత్త రోడ్లపై ఐఆర్సీ ప్రమాణాలు పక్కాగా పాటించడంతో పాటు ప్రస్తుతం ఉన్న రంబుల్ స్ట్రిప్స్ కాలగమనంలో మందం తగ్గి సాధారణంగా మారనున్నాయి.
ప్రమాదాల నివారణలో భాగంగా ఐఆర్సీ నిబంధనలను పక్కాగా పాటించనున్నారు. ప్రధానంగా ఎస్వోపీ ప్రకారం రోడ్ మార్కింగ్, సైనేజ్, రోడ్ కర్వ్ (మూల మలపులు సూచించే బోర్డులు), జీబ్రా క్రాసింగ్‌లు, స్కూల్ జోన్స్, హాస్పిటల్ జోన్స్, సైకిల్ ట్రాక్‌లు, బస్ బేలు, ఆన్ స్ట్రీట్ పార్కింగ్, ఆఫ్ స్ట్రీట్ పార్కింగ్, ఏరియల్ రోడ్లు, రహదారులపై స్పీడ్ లిమిట్ , ఓవర్ టేకింగ్ సైన్ , పాదాచారుల క్రాసింగ్ సూచించే గుర్తులను కచ్చితంగా అమలు చేయనున్నారు. రహదారుల భద్రతకు పెద్దపీట వేయనున్నారు.