సిటీబ్యూరో: ఆర్టీఓలకు డీటీసీలు, డీటీసీలకు జేటీసీలుగా పదోన్నతులు దక్కాయి. కానీ సీనియర్ ఎంవీఐలకు మాత్రం అదృష్టం కలిసిరావడం లేదు. ఉన్నతాధికారులు సీనియర్ ఎంవీఐలకు ఆర్టీఓలకు పదోన్నతి కల్పిస్తూ లిస్ట్ రెడీ చేశారు. సంబంధిత అధికారులకూ సమాచారం ఇచ్చారు. ఇక అదే రోజు జీవో జారీ అవుతుందని ఆశపడ్డారు. కానీ పదోన్నతుల ఫైలు మాత్రం వారం రోజులుగా కదలడం లేదు. ఉన్నతాధికారుల వద్దనే ఆగిపోయిందని తెలుస్తున్నది. దీంతో పదోన్నతి లిస్టులో ఉన్నవారు తీవ్ర నైరాశ్యం చెందుతున్నారు.
రవాణా శాఖలో అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగంలో చేరిన వారికి ఎంవీఐ పదోన్నతితో సర్దుకోవాల్సి వస్తుంది. చాలా మంది ఏఎంవీఐ స్థాయిలోనే ఉద్యోగ విరమణ చేయాల్సి వస్తోంది. చాలా తక్కువ మందికి మాత్రమే ఆర్టీఓలుగా పదోన్నతి లభిస్తుంది. జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అసిస్టెంట్‌కు పదోన్నతి ఉంటుంది. కానీ ఏఓ గా పదోన్నతి మాత్రం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. నగరంలో కొన్ని చోట్ల సీనియర్ ఎంవీఐలే ఇన్చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో నగరంలో ముగ్గురు నుంచి నలుగురు ఎంవీఐలకు ఆర్టీఓలుగా పదోన్నతి లభించనుంది. రవాణా శాఖ పదోన్నతి ఫైలును ఎంత త్వరగా పూర్తి చేసి జీఓ జారీ చేస్తే అంత మంచిదని అధికారులు కోరుతున్నారు.