శేరిలింగంపల్లి : మియాపూర్-2 డిపోకు చెందిన పుష్పక్ ఎయిర్పోర్టు బస్సులో గురువారం ఓ మహిళా ప్రయాణికురాలు మర్చిపోయిన బ్యాగును శుక్రవారం డిపోలో అధికారులు అందజేశారు. సదరు మహిళ పోగొట్టుకున్న బ్యాగులో ఎనిమిది లక్షల విలువైన బంగారు ఆభరణాలు, వస్తువులను ప్రయాణికురాలికి అందించారు. ఈ సందర్భంగా బస్సు డ్రైవర్ను ఆర్టీసీ అధికారులు అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ అపర్ణ కళ్యాణి, డిపో మేనేజర్ వెంకటేశం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.
మియాపూర్-1 డిపో నుంచి తిరుపతి, విశాఖపట్నం, గుంటూరు, బెంగళూరు, భద్రాచలం, విజయవాడ, ఒంగోలు, కడప, అనంతపురం, తాడిపత్రి రూట్లలో సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సులు నడపబడుతున్నాయని, ప్రయాణికులు దూర ప్రాంత సర్వీసులను వినియోగించుకోవాలని మియాపూర్ డిపో వన్ ఆర్టీసీ అధికారులు కోరారు. దూరప్రాంత సర్వీసుల సేవలపై ఏమైనా సూచనలు, సలహాలు తెలుపాలని ఇందుకోసం డిపో మేనేజర్ మియాపూర్-1 ఫోన్ నెంబర్ 9959226153 లో మే 17న ఉదయం 11 నుంచి 12 గంటల మధ్య సంప్రదించాలని కోరారు.
మియాపూర్ -1 డిపో నుంచి బస్ ఆన్ కాంట్రాక్టు పద్ధతిన తీర్థయాత్రలకు, వివాహాలకు, శుభకార్యాలకు, విహారయాత్రలకు సూపర్ లగ్జరీ, రాజధాని, లహరి బస్సులు సరసమైన రుసుములకు అద్దెకు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.