RTC Employees | శామీర్పేట, మార్చి 14 : ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్ థామస్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆర్టీసీ జేఏసీ సమ్మె సన్నాహక భాగంలో శుక్రవారం హకీంపేట్ బస్ డిపో వద్ద డిపో జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని, ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి ఆర్టీసీ డ్రైవర్లతో నడిపించాలని, రెండు పీఆర్సీలు ఇవ్వాలని, పని గంటలు తగ్గించాలని డిమాండ్ చేశారు. అలాగే యూనియన్లను పునరుద్ధరించాలన్నారు. 21 డిమాండ్లతో ఆర్టీసీ యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చినట్టు తెలిపారు. జేఏసీ ఎప్పుడు పిలిపిస్తే అప్పుడు ఉద్యోగులందరూ సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో టీఎంయూ వర్కింగ్ ప్రెసిడెంట్ కమలాకర్ గౌడ్, కో కన్వీనర్లు సుద్దాల సురేష్, ఎన్ఎంయూ వల్లూరి బాబు పాల్, డిపో జేఏసీ నాయకులు బాలరాజు, గోపు శ్రీనివాస్, రామచందర్, రమేష్, సుగుణ చారి, రాజేందర్, నాగరాజు, ఎండి ఇబ్రహీం, శర్పొద్దీన్, పద్మ, వినోద, నాగమణి, సునీత, సుజాత, తిరుపతమ్మ, మొగులమ్మ, ఉద్యోగులు పాల్గొన్నారు.