విభిన్నమైన మార్గాలు ఎంచుకుంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో వసతుల కల్పనకు ఖర్చు చేసేది గోరంత అయితే లెక్కల్లో కొండంత చూపుతూ జేబులు నింపుకొంటున్నారు. ప్రతి దాంట్లో చేతివాటం చూపుతూ ఇష్టారీతిన అక్రమార్జనకు అలవాటు పడుతున్నారు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలిలో ఇది సర్వసాధారణమైంది.
– సిటీ బ్యూరో, ఏప్రిల్ 2(నమస్తే తెలంగాణ)
పీసీబీలో కొంత మంది అధికారులు ఏ రూపంలో ప్రజాధనాన్ని లూటీ చేయాలనే అన్వేషణలో భాగంగా నాసీరకం వస్తువులను ఏర్పాటు చేసి బిల్లులు మాత్రం ఇష్టానుసారంగా రాస్తూ అక్రమార్జన చేస్తున్నారు. కార్యాలయ నిర్వహణలో భాగంగా ఇటీవల పనిచేయని లిఫ్ట్ స్థానంలో రూ.11,71,780 వెచ్చించి కొత్తది ఏర్పాటు చేసినట్లు లెక్కల్లో చూపారు. కానీ అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కనీసం ఆర్నైళ్లెనా గడవక ముందే మరమ్మతులకు గురైంది.
లక్షలాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన లిఫ్ట్ ఆర్నెళ్లు గడవకముందే పనిచేయకపోవడంపై అధికారుల చేతివాటం బయటపడింది. సాధారణంగా ఏదైనా కొత్త వస్తువు కొనుగోలు చేస్తే కనీసం ఒక సంవత్సరమైనా వారంటీ ఇస్తారు. ఏదైనా మరమ్మతులకు గురైతే కంపెనీ ప్రతినిధులు వచ్చి ఎలాంటి సర్వీసు ఛార్జీలు లేకుండా రిపేరు చేస్తారు. అలాంటిది ఏకంగా రూ.11.71 లక్షలు వెచ్చించి కొనుగోలు చేసిన లిఫ్ట్ మరమ్మతులకు గురైతే మూడు నెలలు దాటినా.. రిపేర్ చేయించకపోవడం ఏంటి? అసలు అది కొత్తదేనా? లేదంటే కార్యాలయ నిర్వహణ అధికారులు చేతివాటం ప్రదర్శించి నాసిరకం లిఫ్ట్ ఏర్పాటు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఉన్నతాధికారుల మౌనం ఎందుకు?
కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం నిర్వహణ కోసం 2025-26 సంవత్సారానికి మొత్తం రూ.31,24,623 ఖర్చయినట్లు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అందులో కార్యాలయ నిర్వహణలో భాగంగా వివిధ పనుల కోసం వెచ్చించినట్లు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్వోల నుంచి సిబ్బంది, వివిధ పరిశ్రమలు, ఇతర సంస్థల ప్రతినిధులు నిత్యం కార్యాలయానికి వస్తుంటారు. వారితో పాటు కార్యాలయ సిబ్బందికి వసతులు కల్పించేందుకు ఖర్చు అవుతుంది. కానీ అందులో కూడా నాసీరకం వస్తువులు వాడుతూ అధికారులు అవినీతి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి.
అయితే కార్యాలయ నిర్వహణకు అయ్యే ఖర్చుల వివరాలు మెంబర్ సెక్రెటరీ తనిఖీ చేసిన తర్వాతనే నిధులు విడుదల చేస్తారు. లిఫ్ట్ కోసం లక్షలు ఖర్చు చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంబంధిత సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నా ఎందుకు చూసీ చూడనట్లు వ్యవహిరిస్తున్నారు? కార్యాలయంలో ఏం జరుగుతుందో తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారిగా మెంబర్ సెక్రటరీకి ఉంటుంది కదా? ఇదే వ్యవహారంపై ఇప్పుడు పీసీబీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.