ఉస్మానియా యూనివర్సిటీ, మార్చి 18:ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ హాస్టల్లో బాత్రూంలో పైకప్పు పెచ్చులూడిపడంతో ఓ విద్యార్థికి స్వల్ప గాయాలయ్యాయి. తృటిలో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఆందోళన చెందిన విద్యార్థులు ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. అప్రమత్తమైన పోలీసులు ప్రధాన రహదారిని మూసివేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. పైకప్పు పెచ్చులు ఊడిపడటం తమకు సాధారణంగా మారిందని, ఎవరి తలపైనైనా ఆ పెచ్చులు పడితే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులకు తెలలిపినా ఫలితంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్లో ఉండాలన్నా, బాత్రూంకి వెళ్లాలన్నా భయమేస్తుందని వాపోయారు.
ఇప్పటికైనా తమ హాస్టల్‌ని మూసేసి వేరే దగ్గర హాస్టల్ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయి, ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న హాస్టల్లో తమకు గదులు కేటాయించాలని కోరారు. ఇలాంటి సమస్యలు ఉన్నా ఆందోళనలు చేయకూడదంటే ఎలా అని ప్రశ్నించారు. అధికారులు జారీ చేసిన సర్క్యులర్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అధికారులు విద్యార్థులతో చర్చలు జరిపినా ఫలితంలేకపోయింది. దీంతో విద్యార్థులు తమ ఆందోళనలను కొనసాగించారు. చివరికి బుధవారం వీసీతో విద్యార్థులకు మాట్లాడే అవకాశం కల్పిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు.