బంజారాహిల్స్,డిసెంబర్ 1: జీహెచ్ఎంసీకి చెందిన పార్కులో రోడ్డు వేస్తున్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం 1, రోడ్ నెం 66 మధ్యన సుమారు 1600 గజాల విస్తీర్ణంలో జీహెచ్ఎంసీ పార్కు ఉంది. సొసైటీ లే అవుట్లో సైతం ఈ స్థలాన్ని పార్కుగా చూపించారు. గతంలో హరితహారం కార్యక్రమంలో భాగంగా పార్కులో మొక్కలు నాటారు. ఈ పార్కులో నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నెం 66 వైపునకు కనెక్టింగ్ రోడ్డు పేరుతో సోమవారం పనులు ప్రారంభించారు.
పార్కు స్థలాన్ని ఆక్రమిస్తూ లే అవుట్లో లేని రోడ్డును కొత్తగా వేయడం పై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్ దృష్టికి తీసుకువెళ్లారు. కార్పొరేటర్ వెంటనే పనులు ఆపేయాలని సూచించారు. తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఫిర్యాదు చేశారు. 45 ఏళ్ల క్రితంనుంచి పార్కుగా ఉందని, రోడ్డు వేయడం అక్రమమంటూ జూబ్లీహిల్స్ సొసైటీ మాజీ కార్యదర్శి హనుమంతరావు జోనల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు.