
సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): /శామీర్‌పేట : ఒకరిది ఏమరుపాటు..మరొకరిది అతివేగం.. ప్రమాదానికి కారణమయ్యాయి. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, ఇద్దరికి గాయాలయ్యాయి. శామీర్‌పేట పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం… శామీర్‌పేటకు చెందిన షేక్ సలీం తన స్నేహితుడు బత్తుల హరికృష్ణ(55)తో కలిసి వాహనంలో పెట్రోల్ పోయించుకుని గ్రామానికి వచ్చేందుకు శామీర్‌పేట ప్రధాన చౌరస్తా వద్ద రోడ్డెక్కి యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో తూంకుంట నుంచి బైక్‌పై వస్తున్న ముత్తురాజ్ అతివేగంగా వచ్చి వీరి వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న బత్తుల హరికృష్ణ కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా, మరణించాడు. సలీంతో పాటు ముత్తురాజ్‌కు స్వల్పగాయాలయ్యాయి.
ఇండికేటర్ వేసి…లేన్ క్రమశిక్షణ పాటించి ఉంటే శామీర్‌పేటలో రోడ్డు ప్రమాదం జరిగి ఉండేది కాదు. కేవలం చిన్న పాటి నిర్లక్ష్యం వల్ల నిండు ప్రాణం పోయింది. మూడు లేన్ల దూరం నుంచి యూటర్న్‌కు వాహనాన్ని మలుపు తిప్పడమే ప్రమాదానికి కారణమైంది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో నమోదయ్యాయి. రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ సంఘటనను విశ్లేషించిన శాంతి భద్రతలు, ట్రాఫిక్ పోలీసులు ఇద్దరు వాహనదారులు డ్రైవింగ్ క్రమశిక్షణను పాటించకపోవడం, అతి వేగంతో ప్రయాణించడం వల్లే దుర్ఘ్ఘటన చోటుచేసుకుందని నిర్ధారించారు.
ఒక్కసారిగా మలుపుతిప్పడంతో.. శామీర్‌పేట్‌కు చెందిన సలీం ఉదయం స్నేహితుడు హరికృష్ణతో కలిసి స్థానిక పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న బంకులో ద్విచక్రవాహనంలో పెట్రోల్ పోయించుకున్న అనంతరం.. రోడ్డెక్కి మూడో లేన్ నుంచి అకస్మాతుగా యూటర్న్ తీసుకునేందుకు ప్రయత్నించాడు. ఈ కారణంగా అతివేగంగా వస్తున్న చందానగర్‌కు చెందిన ముత్తు రాజ్‌కు గమనించే అవకాశం లేకుండా పోయింది. అదే వేగంతో వారిని వాహనాన్ని ఢీకొట్టాడు. సలీం, హరికృష్ణ హెల్మెట్లు కూడా ధరించలేదు. ప్రమాదంలో హరికృష్ణ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. కొండపోచమ్మ సాగర్‌ను చూసేందుకు వెళ్తున్న ముత్తురాజ్ హెల్మెట్‌తో పాటు జాకెట్, చేతులకు గ్లౌజ్‌లు ధరించడంతో స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.
విచారణలో ద్విచక్రవాహనం నడిపిస్తున్న సలీంకు డ్రైవింగ్ లైసెన్స్ లేదని తెలిసింది. మలుపు సమయంలో సలీం ఇండికేటర్ వేసి .. ముందుగా తన వాహనాన్ని రాజీవ్ రహదారిపై మూడో లేన్ నుంచి మొదటి లేన్‌కు వచ్చి..ఆ తర్వాత యూ టర్న్ తీసుకుంటే ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని పోలీసులు స్పష్టం చేశారు. కాగా, రోడ్డు నిబంధనలు పాటించకుండా హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసిన సలీంతో పాటు అతివేగంగా, అజాగ్రత్తగా వాహనం నడుపుతూ ఒకరి ప్రాణం పోవడానికి కారణమైన ముత్తురాజ్లపై కేసులు నమోదు చేశారు.