సిటీబ్యూరో, జనవరి 23(నమస్తే తెలంగాణ): అత్యంత దారుణంగా భార్యను హతమార్చి నరరూప రాక్షసుడిగా మారిన భర్త వ్యవహారంపై రాచకొండ పోలీసులు లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. మీర్పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో భార్యను హత్య చేసి ముక్కలుగా చేసి ఉడికించి, వాటిని చూరగా చేసిన కిరాతకుడైన భర్త గురుమూర్తి ఘటన తెలిసిందే. పోలీసులకు ఆధారాలు సేకరించడం పెద్ద తలనొప్పిగా మారిం. భార్యను హతమార్చిన భర్త పక్కా స్కెచ్‌తో మృతదేహం ఆధారాలు దొరకకుండా జాగ్రత్త పడ్డాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే ఆధారాలు సేకరించేందుకు సాంకేతికతను ఉపయోగిస్తున్నారు.
2018లో ఉప్పల్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన నరబలి కేసులో బ్లూరేస్ లైటింగ్ సాంకేతిక పరిజ్ఞానంతో గోడ రంధ్రాలు, ఫ్లోరింగ్ టైల్స్ మధ్యలో ఉన్న శుభ్రం చేసిన తరువాత కూడా మిగిలిపోయిన రక్తనమూనాలను సేకరించి ఆధారాలను రాబట్టిన విషయం తెలిసిందే. అదే పరిజ్ఞానాన్ని ప్రస్తుతం ఈ కేసులో కూడా పోలీసులు ఉపయోగించారు.అంతేకాకుండా ఈనెల 14 నుంచి 16వ తేదీ మధ్య కాలంలో గురుమూర్తి మాట్లాడిన సెల్‌ఫోన్ కాల్స్‌ను కూడా పోలీసులు విశ్లేషిస్తున్నారు. కాగా గురువారం క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ విభాగాలు పలు ఆధారాలు సేకరించాయి. ఈ ఆధారాలను విశ్లేషించిన తరువాతే ఘటనపై స్పష్టత వస్తుందనే భావనలో పోలీసులు ఉన్నారు.
జిల్లెలగూడలోని వెంకటేశ్వరనగర్‌లో నివాసముండే గురుమూర్తి, వెంకట మాధవి దంపతుల మధ్య సంక్రాంతి పండుగకు ఊరికి వెళ్లాలనే విషయంలో గొడవ జరిగినట్లు తెలిసింది. 14వ తేదీ తమ ఇద్దరు పిల్లలను గురుమూర్తి తన బంధువుల ఇంట్లో దింపి రాగా, 15వ తేదీన ఇద్దరి మధ్య గొడవ జరగడంతో గురుమూర్తి మాధవిని కొట్టి చంపినట్లు వెల్లడైంది. అదేరోజు కనుము పండుగ కావడంతో ఆమె శరీరాన్ని ముక్కలుగా కోసి ఆధారాలు లేకుండా చేయాలని ప్లాన్ చేశాడు. ఆ ఇంట్లో ఉన్న మిగతా కిరాయిదారులు కూడా పండుగకు ఊరెళ్లడంతో ఆ ఇంటి ఆవరణలో ఎవరు కూడా లేరు. దీంతో పక్కింట్లో ఉన్న వారు ఎవరు కూడా తమపై దృష్టి సారించేందుకు అవకాశముండదని, ఏదైనా వాసన వచ్చినా పండుగ రోజు కాబట్టి ఏదో చేసుకుంటున్నారనే ధోరణి ఉంటుందని భావించాడు. హత్య చేసిన తరువాత ఆమె శరీర భాగాలను ముక్కలుగా కోసి, వాటిని హీటర్‌లో మరుగ పెట్టి, ఆ తరువాత బయటపడ్డ బొక్కలను కుక్కర్లో ఉడికించి, దీనికి పెద్ద స్టౌవ్‌ను వాడాడు. ఆ తరువాత వాటిని మిక్సీలో వేసి పొడి చేసి, వాటన్నింటిని టాయిలెట్లో వేసి ఫ్లష్ చేసినట్లు నిందితుడు వెల్లడించడంతో అన్ని విషయాలను పోలీసులు పరిశీలించారు.
హీటర్, కుక్కర్, టాయిలెట్, మాంసం కొట్టే చెక్క మొద్దు, గోడలపై ఉండే రక్తపు మరకలు, అక్కడ లభించిన వెంట్రుకుల, గాజులు ఇలా చిన్న చిన్న వస్తువులను ఫోరెన్సిక్ విభాగం సేకరించింది. ఆధారాలు బయట పడకుండా ఉండేలా ఇల్లు, బాతురూమ్, గోడలను శుభ్రం చేసినా క్లూస్ టీమ్‌తో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో అక్కడ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. అయితే సేకరించిన ఆధారాలను విశ్లేషించి పోలీసులు ఈ హత్య విషయంలో ఒక నిర్ధారణకు రానున్నారు.
సీసీ కెమెరాలు కీలకం!
భార్యను హత్య చేసి ఆధారాలు లేకుండా చేసిన తరువాతే గురుమూర్తి తన అత్త మామలకు ఫోన్ చేశాడు. ఆ తరువాత 18వ తేదీన వారితో కలిసి వెళ్లి మీర్పేట్ పోలీసులకు మిస్సింగ్‌పై ఫిర్యాదు చేశాడు. గురుమూర్తిపై అనుమానంతో పోలీసులు సీసీ కెమెరాలను తనిఖీ చేయగా.. 14వ తేదీన మాధవి ఇంట్లోకి వెళ్లినట్లు ఉన్నది.. ఆ తరువాత ఆమె బయటకు వచ్చిన ఆనవాళ్లు లేకపోవడంతో పక్కా ప్లాన్‌తో హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. దాంతో పాటు సీసీ కెమెరాలలో గురుమూర్తి ఏదో సంచిలో తీసికెళ్లిన ఆనవాళ్లు కూడా లభించాయి. బీఎన్ఎస్ చట్టంలో ఎలక్ట్రానిక్‌కు సంబంధించిన సాక్ష్యాలు కూడా చెల్లుతాయి. దీంతో క్లూస్ టీమ్ ఇచ్చే సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజీలు ఇప్పుడు పోలీసులకు కీలకంగా మారనున్నాయి.
ఇదిలా ఉండగా పోలీసులు ఈ ఘటనపై ఎవరూ స్పందించడంలేదు. గురుమూర్తి చెబుతున్న మాటలు ఎంత వరకు నిజమనేది కూడా అనుమానిస్తున్నారు. మరో పక్క గురుమూర్తికి మరో మహిళతో సంబంధాలున్నాయనే అనుమానాలు రావడంతో, మాధవిని వదిలించేందుకు పక్కా ప్లాన్‌తో సంక్రాంతికి అందరిని పంపించేసి హతమార్చాడా? అనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై ఒకటి రెండురోజుల్లో పూర్తి స్పష్టత ఇస్తామని పోలీసులు పేర్కొంటున్నారు. మాధవి హ్యత మిస్టరీని పోలీసులు ఎలా ఛేదిస్తారన్నది సందిగ్ధంగా మారింది. పోలీసులు మాత్రం ఇప్పటికీ హత్య జరిగినట్లు ఎక్కడా చెప్పడం లేదు. మాధవి అదృశ్యంగానే భావిస్తున్నామని మీర్‌పేట సీఐ నాగరాజు తెలియజేస్తున్నారు.