మాదాపూర్, ఆగస్టు 16: నీట్ కోచింగ్ కోసం హాస్టల్‌కు వచ్చిన విద్యార్థినిపై హాస్టల్ యజమాని అసభ్యకరంగా ప్రవర్తించడంతో బంధువులు చితకబాదారు. ఈ సంఘటన శనివారం మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. ఇన్స్పెక్టర్ కృష్ణ మోహన్ వివరాల ప్రకారం … గత నెల 13న షేక్‌పేట్‌లో నివాసం ఉంటున్న ఓ మైనర్ విద్యార్థిని నీట్ కోచింగ్ కోసం మాదాపూర్‌లోని అయ్యప్ప సొసైటీకి చెందిన ఎన్పీపీ ఎగ్జిక్యూటివ్ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్నది. అప్పటి నుంచి హాస్టల్ యజమాని సత్యప్రకాశ్.. ఆ విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైంది.
గత 10 రోజుల కిత్రం విద్యార్థిని తల్లి.. కూతురు వద్దకు రావడంతో కలతచెందినట్లు కనిపించింది. కుటుంబ సభ్యులు మాట్లాడగా… హాస్టల్ యజమాని సత్యప్రకాశ్..తనతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పింది. దీంతో విద్యార్థిని తల్లిదండ్రులు, బంధువులు వచ్చి హాస్టల్‌పై దాడిచేసి సత్య ప్రకాశ్‌ను చితకబాదారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు పోక్సో కేసు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.