మేడ్చల్ జిల్లా అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583, 22 ఏ నిషేధిత జాబితాలోని భూముల్లో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు వచ్చిన ఆరోపణలపై అధికారులు విచారణ చేపట్టారు. 37 ఎకరాల్లో అర్బన్ సీలింగ్ ల్యాండ్ నిషేధిత జాబితాలో ఉన్నా.. వల్లభపూర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో 189 ప్లాట్లు రిజిస్ట్రేషన్లు జరిగినట్లు అంచనా. ఇప్పటికే సుమారు రూ.50 కోట్ల విలువైన ప్లాట్ల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఆరోపణలు రావడంతో ఈ అంశాన్ని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఇటీవల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై విచారణ జరిపి.. నివేదిక అందించాల్సిందిగా మంత్రి అధికారులను ఆదేశించారు. ఇందులోభాగంగా అధికారులు రంగంలోకి దిగారు. నిషేధిత జాబితాలోని భూములను ఎలా రిజిస్ట్రేషన్ చేశారు..? ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయి? అన్న అంశంపై విచారణ జరిపి నివేదికను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్‌తో పాటు మేడ్చల్ కలెక్టర్ మను చౌదరికి జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి పంపించినట్లు సమాచారం. అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలితే బాధ్యులందరిపై చర్యలు తీసుకునే అవకాశమున్నది.
మేడ్చల్, మే 14(నమస్తే తెలంగాణ): నిషేధిత భూములలో అక్రమ రిజిస్ట్రేషన్ల జరిగినట్లు వచ్చిన ఆరోపణల మేరకు విచారణ ప్రారంభమైంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండలంలోని సర్వే నంబర్లు 582, 583, 22ఎ నిషేధిత జాబితాలో ఉన్న భూములలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 37 ఎకరాలలో యూఎల్సీ (అర్బన్ సీలింగ్ ల్యాండ్) నిషేధిత జాబితాలో ఉన్నప్పటికీ వల్లభపూర్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి.
ఇక్కడ ఇప్పటికే సుమారు రూ.50 కోట్ల విలువ గల దాదాపు 189 భూముల(ప్లాట్ల) అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ప్రజల నుంచి వచ్చిన ఆరోపణల మేరకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ, గృహ నిర్మాణశాఖల సమస్యల పరిష్కారంపై రెండు రోజుల క్రితం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన సమావేశంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఉన్నతాధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ చేసి నివేదికను అందించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అధికారులకు ఆదేశించిన నేపథ్యంలో అర్బన్ సీలింగ్ ల్యాండ్ నిషేధిత జాబితాలో ఉన్న రిజిస్ట్రేషన్లు జరిగినత తీరుపై విచారణ చేపట్టి నివేదిలకను సిద్ధం చేశారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను రిజిస్ట్రేషన్ ఎలా చేశారు. ఎన్ని రిజిస్ట్రేషన్లు జరిగాయన్న దానిపై విచారణ జరిపి నివేదికను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్‌తో పాటు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరికి జిల్లా రిజిస్ట్రేషన్ అధికారి పంపించినట్లు సమాచారం.
అధికారుల తీరుపై విమర్శలు
అల్వాల్ మండలంలోని అదే ప్రాంతంలో 40 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వడ్డెర కులస్తులకు మాత్రం నోటీసులు ఇస్తున్న అధికారులు అక్రమ రిజిస్ట్రేషన్లను మాత్రం యథేచ్చగా చేస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. నిరుపేదలకు ఒక న్యాయం కబ్జాదారులకు ఒక న్యాయమా అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అక్రమాలు తేలితే బాధ్యులపై చర్యలు!
నిషేధిత భూములలో వల్లభపూర్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలితే బాధ్యులు అందరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సబ్ రిజిస్ట్రార్‌ను సస్పెండ్ చేయడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్నవారిపై కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. రెండు మూడు రోజులలో ఉన్నతాధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది.