Hacking | సిటీబ్యూరో: ఇన్నాళ్లు తన పనిని పక్కన పెట్టేసిన సిటీ పోలీస్ కమిషనరేట్‌లో ఐటీ విభాగం..ఆలస్యంగానైనా మేల్కొంది. రెండు నెలల కిందట తెలంగాణ మొబైల్, కంప్యూటర్ అప్లికేషన్లు హ్యాకింగ్ గురికావడంతో సిటీ ఐటీ విభాగం పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే మేల్కొని.. అప్లికేషన్లను పునరద్ధరిస్తోంది. ఇందులోభాగంగానే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన వెబ్‌సైట్‌ను రెండు రోజుల కిందట పునరుద్ధరించారు.
పోలీసింగ్‌కు మానవ వనరులు ఒక ఎత్తయితే, టెక్నాలజీ కూడా అందుకు తన వంతు సహకరిస్తూ శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నివారణలో తోడ్పాటునందించాయి. కాగా, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గతంలో ప్రజలు, పోలీస్ శాఖలో అంతర్గత సేవల కోసం ఉపయోగించిన అప్లికేషన్లపై ఫోకస్ తగ్గించారు. ఇంతలోనే ఆయా అప్లికేషన్లపై హ్యాకర్స్ విరుచుకుపడ్డారు.
దీంతో వాటిని మొత్తానికే పక్కన పెట్టేంత పనిచేసేశారు. అప్పటికే పోలీస్ వ్యవస్థలో చాలా పనులు, పర్యవేక్షణ ఆయా మొబైల్ అప్లికేషన్‌తో జరగడంతో, సిబ్బంది పనితీరు, ప్రజలకు వేగంగా సేవలు అందించే ప్రక్రియకు ఆటంకం కలిగింది. పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా పెట్రోలింగ్ వ్యవస్థ మారిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితులన్నీ తిరిగి యధాస్థితికి వచ్చాయని, అప్లికేషన్ల పునరుద్ధరణ జరగడంతో పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు.
మంకీపాక్స్‌తో భయం వద్దు
సపోర్టింగ్ ట్రీట్మెంట్తో చెక్ పెట్టవచ్చంటున్న వైద్యులు
సిటీబ్యూరో, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): మంకీ పాక్స్‌తో భయం అవసరం లేదని వైద్యనిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ర్టాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినప్పటికీ గాంధీ, నల్లకుంట ఫీవర్ వైద్యశాలల్లో ముందస్తుగా ఐసొలేషన్ వార్డులు ఏర్పాటు చేయడంతో మంకీ పాక్స్‌పై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. అయితే మంకీ పాక్స్ అనే వైరస్ కొత్తేమీ కాదని, అది పాతదే అని, సపోర్టింగ్ ట్రీట్మెంట్తో వైరస్‌కు చెక్ పెట్టవచ్చని వైద్యులు అంటున్నారు. 1950లో తొలిసారిగా ఈ వైరస్‌ను కోతుల్లో గుర్తించడం వల్ల దీనికి మంకీ పాక్స్ అనే పేరు వచ్చిందని చెప్పారు. ప్రారంభంలో కోతులకు వచ్చిన వైరస్.. క్రమంగా వాటి నుంచి మనుషులకు సోకింది. ఆ తరువాత ప్రస్తుతం మనుషుల నుంచి మనుషులకు సోకుతోందని అంటున్నారు.
మరణాల రేటు చాలా తక్కువ..
మంకీపాక్స్ అనేది ఆర్థోఫాక్స్ జాతికి చెందిన ఒక వైరస్. ఇది కొన్ని సార్లు మెదడు లేదా ఇతర అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఇన్ఫెక్షన్ల వల్ల కొంత మందిలో పరిస్థితి విషమించే అవకాశాలుంటాయి. మంకీ పాక్స్ కేసుల్లో మరణాల రేటు చాలా తక్కువ. రోగి శరీరంపై నీటి బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగల్లోని నీరు అంటే ఫ్లూయిడ్స్, లేదా శరీరంలోని ఫ్లూయిడ్స్ వల్ల ఇది ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందుతుంది. అంతేతప్ప.. కరోనా లాగా రోగి తుమ్మినా, దగ్గినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. రోగిని తకినప్పుడు అతడి శరీరంలోని ఫ్లూయిడ్స్ అంటితేనే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. జ్వరం, ఇతర వైరల్ ఫీవర్ లక్షణాలతో పాటు రోగి ఒంటిపై నీటి బుగ్గలు వస్తే దానిని మంకీ పాక్స్‌గా అనుమానించాల్సిందే. ఈ లక్షణాలు కనిపించినప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటే వైద్యులను సంప్రదించి.. తగిన చికిత్స తీసుకోవాలి.
-డాక్టర్ రాజారావు, సూపరింటెండెంట్ యాదాద్రి భువనగిరి ప్రభుత్వ దవాఖాన