హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): చారిత్రక కోఠి మహిళా కళాశాల శతాబ్ది ఉత్సవాలకు ముస్తాబవుతున్నది. హైదరాబాద్ నడిబొడ్డున.. ఉద్యానవనాల నడుమ ఈ కాలేజీని ప్రారంభించారు. పది దశాబ్దాలుగా విద్యారంగంలో సేవలందిస్తున్న ఈ కాలేజీకి వచ్చే ఏడాది వందేండ్లు పూర్తికానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి శతాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మహిళా సాధికారత సాధనలో భాగంగా నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ఠాగూర్ పిలుపు మేరకు 1924లో అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ కాలేజీని ప్రారంభించారు. తొలుత నాంపల్లి గోల్డెన్ త్రెషోల్డ్ భవనంలోని బాలికల పాఠశాల ప్రాంగణంలో పీయూసీ హ్యుమానిటీస్ కోర్సులతో షురూ చేశారు. ఆ తర్వాత 1935లో సైన్స్ కోర్సులను ప్రవేశపెట్టారు. తదనంతరం ఆర్ట్స్, సామాజిక శాస్ర్తాల్లో డిగ్రీ కోర్సులను తీసుకొచ్చారు. ప్రస్తుతం డిప్లొమాలో 77 అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 20 పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులను నిర్వహిస్తున్నారు.
1924లో ఈ కాలేజీని కేవలం ఏడుగురి అధ్యాపకులతో ప్రారంభించారు. 1950లో కోఠిలోని ప్రస్తుత క్యాంపస్‌లోకి మార్చారు. 1803లో కోఠిలో నిర్మించిన బ్రిటిష్ రెసిడెన్సీ అంతర్భాగంగా 63 ఎకరాల్లో కాలేజీని నడిపారు. ఆ తర్వాత, ఇందులోని కొంత స్థలాన్ని ఉస్మానియా మెడికల్ కాలేజీకి ఇవ్వగా, ప్రస్తుతం 42 ఎకరాల విశాలమైన స్థలంలో కాలేజీని నిర్వహిస్తున్నారు. 220 ఏండ్ల నాటి బ్రిటిష్ రెసిడెన్సీ భవనం ఈ వర్సిటీకి ప్రధాన ఆకర్షణ కాగా, ఇది వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్ హెరిటేజ్ బిల్డింగ్ జాబితాలో ఒకటిగా నిలిచింది. కాగా, గత ఏడాది ఈ కాలేజీని రాష్ట్రంలో తొలి తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. వైస్‌చాన్స్‌లర్‌ను కూడా నియమించింది. ప్రఖ్యాత బయోటెక్నాలజిస్ట్ డాక్టర్ కైజర్ జమీల్, కర్ణాటక ప్రభుత్వ మాజీ సీఎస్ కె.రత్నప్రభ, ఈపీటీఆర్ఐ డీజీ ఐఏఎస్ అధికారి వాణీప్రసాద్, ప్రస్తుత ఇన్చార్జి వీసీ విజ్జులత తదితరులు ఈ కాలేజీ పూర్వ విద్యార్థులే కావడం గమనార్హం.
మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాలను ఈ సెప్టెంబర్‌లో ప్రారంభించి ఏడాది పొడవునా నిర్వహిస్తాం. ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌ను ఆహ్వానిస్తాం. కాన్వకేషన్, వార్షికోత్సవం, పూర్వ విద్యార్థుల సమ్మేళనాలు ఉంటాయి. వాకథాన్, రన్లు, సదస్సులు, వర్క్‌షాప్‌లు ఏడాది పొడవుగా నిర్వహించాలని భావిస్తున్నాం.
-విజ్జులత, ప్రొఫెసర్, ఇన్చార్జి వీసీ కాలేజీ ప్రత్యేకతలు