తెలుగు యూనివర్సిటీ, మార్చి 23: రసరంజని 32వ వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఈ నెల 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నాటకోత్సవాలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన పోస్టర్‌ను రెడ్‌హిల్స్‌లోని డాక్టర్ కేవీ రమణాచారి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం నాడు రసరంజని కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రసరంజని ఉపాధ్యక్షులు డాక్టర్ డి.విజయభాస్కర్ మాట్లాడుతూ.. రసంజని సాంస్కృతిక సంస్థ గత మూడు దశాబ్దాలకు పైగా నాటక కళారంగానికి విశేష సేవలందిస్తుందని తెలిపారు.
రసరంజని గొప్ప సాంస్కృతిక క్షేత్రంగా నాటకరంగానికి అవిశ్రాంత సేవలు అందిస్తుందని విజయభాస్కర్ అన్నారు. మూడు రోజుల పాటు జరగనున్న నాటకోత్సవాలకు ఉచిత ప్రవేశం కలదని కార్యదర్శి కేతినీడి నటరాజ్ వెల్లడించారు. ప్రపంచ రంగ స్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న నాటకోత్సవాలలో 25న మంగళవారం సాయంత్రం కోనేటి సుబ్బరాజు రచించి దర్శకత్వం వహించిన నర్తన శాల, బుధవారం సాయంత్రం కొడాలి గోపాలరావు రచించిన ఛైర్మన్ నాటకం, పిన్నమనేని మృత్యంజయరావు రచించిన ధర్మో రక్షతి నాటకానికి ఆర్.వాసు దర్శత్వంలో ప్రదర్శితమవుతాయన్నారు. రసరంజని యువ పురస్కారాన్ని అజయ్ మంకెనపల్లికి ప్రదానం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. రసరంజని నాటకప్రియుల కోసం ప్రత్యేకంగా ఏడాదికి గాను వెయ్యి రూపాయాలతో ఇద్దరికి ప్రవేశం కలిపించే మెంబర్షిప్ డ్రెవ్ను చేపట్టామని అన్నారు. వివరాలకు 9849094765నెంబర్లో సంప్రదించవచ్చని నటరాజ్ తెలిపారు.