Rapol Sai Santosh | మన్సూరాబాద్, జనవరి 2: హైదరాబాద్, ఎల్బీనగర్కు చెందిన రాపోల్ సాయి సంతోష్ దేశవాళీ 2024-25 సీజన్లో అరుణాచల్‌ప్రదేశ్ అండర్-23 క్రికెట్ టీమ్‌కు ఎంపికయ్యాడు. బీసీసీఐ మెన్స్ అండర్-23 స్టేట్-ఏ ట్రోఫీ కోసం జరుగనున్న పోటీలకు అరుణాచల్‌ప్రదేశ్ క్రికెట్ జట్టు తరఫున ఆడనున్నాడు. 21 ఏండ్ల రాపోల్ సంతోష్ బౌలింగ్ ఆల్‌రౌండర్, ఫాస్ట్ బౌలింగ్‌తోపాటు బ్యాటింగ్‌లోనూ విశేష ప్రతిభ కనబర్చాడు.
గత సంవత్సర కాలంగా అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన వివిధ టోర్నమెంట్లలో సంతోష్ పాల్గొని మంచి నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. అతడిలోని ప్రతిభను గుర్తించిన సెలెక్టర్లు సంతోష్‌ను అరుణాచల్‌ప్రదేశ్ అండర్-23 జట్టుకు ఎంపిక చేశారు.
పన్నెండు సంవత్సరాల వయస్సు నుంచి క్రికెట్ ఆడటం మొదలు పెట్టిన సంతోష్ అనతి కాలంలోనే అద్భుత ప్రతిభ కనబరుస్తూ జాతీయ స్థాయి అండర్-16, అండర్-17 స్కూల్ గేమ్స్‌లో తెలంగాణ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. అండర్-16 విజయ్‌మర్చంట్ ట్రోఫీలోనూ పాల్గొని మంచి ప్రతిభ కనబరిచాడు. హైదరాబాద్‌కు చెందిన కె.వినోద్‌కుమార్, బీఏజీ వాల్టర్ వద్ద శిక్షణ పొంది క్రికెట్లో మెలకువలు నేర్చుకున్నాడు.