సిటీబ్యూరో,అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): చైనా యువతులపై లైంగిక దాడికి పాల్పడి.. బెదిరించిన కేసులో అరెస్ట్ అయిన యెమెన్ దేశస్తుడిపై మంగళవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ విధించారు. యెమెన్‌కి చెందిన అమ్జద్ షాకి అబ్దుల్ రకీబ్ స్టూడెంట్ వీసా మీద హైదరాబాద్‌కు వచ్చాడు. నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నాడు. చైనాకు చెందిన ఇద్దరు యువతులు కూడా విద్యాభ్యాసం కోసం నగరానికి వచ్చి నాచారంలో నివాసం ఉంటున్నారు. ఈ ముగ్గురు స్నేహితులుగా మారారు. ఈ ఏడాది జూన్‌లో అమ్జద్ షాకి చైనా యువతిని పిలిచి ఆమెకు పండ్ల జ్యూస్‌లో మత్తు మందు కలిపి లైంగిక దాడి చేశాడు. మరోసారి మరో చైనా యువతిపై లైంగిక దాడికి యత్నించి తీవ్రంగా దాడి చేశాడు. దీంతో నాచారం పీఎస్‌కు ఫిర్యాదులు అందగా.. దర్యాప్తు చేసిన అధికారులు అమ్జద్ షాకిని అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు పంపారు. అయితే అతడి ప్రవర్తనను గమనించిన సీపీ మహేశ్ భగవత్ పీడీ యాక్ట్ విధించి అమ్జద్ షాకి మరో ఏడాది పాటు జైల్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు.