సిటీబ్యూరో, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ట్రై కార్పొరేషన్ పరిధిలో పట్టణ ప్రణాళికా విభాగం (టౌన్ ప్లానింగ్) తీరు ‘ అడిగివాడు లేకపోతే… చెప్పేవాడు మా చుట్టమే’ అన్నట్లు తయారైంది. చాలా ప్రాంతాల్లో రెసిడెన్షియల్(నివాస) అవసరాలకు జీ+2 అంతస్తులకు అనుమతులు తీసుకున్న యజమానులు, ఏకంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లను కడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా భారీ సెల్లార్లతో అనధికారికంగా అదనపు అంతస్తులు నిర్మిస్తున్నా..పర్యవేక్షించాల్సిన చైన్మెన్లు, న్యాక్ ఇంజినీర్లు, ఏసీపీ, సీపీలు అటు వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక ‘పెద్ద’ కథే ఉందన్న విమర్శలు లేకపోలేదు.
ఇటీవల నానల్‌నగర్ డివిజన్లోని అల్హస్నత్ కాలనీలో అనుమతులు లేకుండా ఏడు అంతస్తుల నిర్మాణం కారణంగా ఇద్దరు మృతి చెందిన సంఘటనతోనైనా టౌన్ ప్లానింగ్ విభాగం అధికారుల్లో చలనం రావడం లేదు. ఫలితంగా రెసిడెన్షియల్ పర్మిషన్తో కమర్షియల్ భవనాలు కొకొల్లలుగా పుట్టుకొస్తున్నాయి. ఇదంతా బహిరంగంగా జరుగుతున్నప్పటికీ అధికారులు మాత్రం అందినంత దండుకుని తమకు ఇబ్బందులు కలుగకుండా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొంటారు.
ఫిర్యాదులు వస్తే మాత్రం మా దృష్టికి రాలేదంటూ సమాధానం ఇస్తున్న పరిస్థితి. కానీ సామాన్య వ్యక్తులు మాత్రం ఒక ఫ్లోర్ అదనంగా వేస్తే చాలు సీజ్ చేసే వరకు వదలరు. అక్రమ నిర్మాణాల చర్యల విషయంలోనూ పేదోడికి ఓ నీతి..పెద్దోడికి మరో నీతి అన్నట్లుగా వ్యవహరిస్తుండడం గమనార్హం. జోనల్ కార్యాలయాలకు జోనల్ కమిషనర్లుగా ఐఏఎస్‌లను నియమించినా, అక్రమ నిర్మాణాలు, నిబంధనల ఉల్లంఘన కొనసాగుతూనే ఉండడం విశేషం.

Ghmc
నిబంధనలు బేఖాతరు
మల్కాజిగిరి జోనల్ పరిధిలోని ఓల్డ్ సఫిల్‌గూడ చౌరస్తాలో రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని, అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతున్నా.. అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. జీ ప్లస్ టూ పేరుతో రెండు నిర్మాణాలకు అనుమతులు తీసుకొని, రెండింటిని కలిపి సెల్లార్‌తో పాటు అదనపు అంతస్తులు నిర్మిస్తూ నిబంధనలు పాటించకుండా కమర్షియల్ నిర్మాణం చేపడుతున్నారు. గత కొన్ని నెలలుగా నిర్మాణం కొనసాగుతున్నా.. అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు చేపట్టడంలేదు. ఈ నిర్మాణం ప్రధాన రహదారిలో చౌరస్తాలో చేపట్టినా టౌన్ ప్లానింగ్ అధికారులకు కనిపించకపోవం గమనార్హం. నిర్మాణం పూర్తిచేసే వరకు అధికారులు ఎందుకు ఉపేక్షిస్తారో వారికే తెలియాలి. వీటిని అరికటే ్టవిధంగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించే ఉన్నతాధికారులు సైతం వీటిపై దృష్టి సారించకపోవడం ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతున్నది. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉందంటూ చెప్పే ప్రభుత్వ పెద్దలు ఇలాంటి విషయాలపై దృష్టి సారించాలి.
అనుమతులు ఒకటి.. నిర్మాణం మరోలా..
అనుమతులు తీసుకొని నిర్మాణం పూర్తిచేసే వరకు పర్యవేక్షణ చేసే సిబ్బంది ఉన్నప్పటికీ వారు ఇలాంటి వాటిని అధికారుల దృష్టికి తీసుకురాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిందిస్థాయిలో పనిచేసే చైన్మెన్లు, న్యాక్ ఇంజినీర్ల విధులు ఏమిటనే ప్రశ్న ఎదురవుతున్నది. సమీక్షలు సమావేశాలు నిర్వహించే అధికారులు నిబంధనలు పాటించని నిర్మాణాలు ఎన్ని, వాటిపై ఏం చర్యలు తీసుకుంటున్నారో అని ప్రశ్నించడం లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు వచ్చినప్పుడు, తమ మాట వినని వారి భవనాలకు నోటీసులు ఇవ్వడం, సీజ్ చేయడం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గౌతంనగర్ డివిజన్లోని జ్యోతినగర్‌లో రెండు అంతస్తులకు అనుమతులు తీసుకొని, ఐదు అంతస్తులు నిర్మించిన ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. అదేవిధంగా గౌతంనగర్, మీర్జాలగూడ వెంకటాద్రినగర్‌లో నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు నిర్మించిన ఎలాంటి చర్యలు లేవు.
కార్పొరేషన్ వచ్చినా మారని తీరు..
ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాటిపై దృష్టిసారించాలి. కార్పొరేషన్ ఏర్పాటు, జోనల్ కార్యాలయాలు సమీపంలోకి తీసుకువచ్చిన ప్రభుత్వం పనితీరుపై కూడా తగిన సమయం కేటాయించాలి. 99 రోజుల ప్రణాళికలో నిత్యం పర్యటించే ఉన్నతాధికారులు.. అక్రమ నిర్మాణాలు జరుగుతున్న.. ఎలాంటి చర్యలు తీసుకోని కిందిస్థాయి అధికారులపై చర్యలు చేపట్టాలి. అదేవిధంగా నిబంధనల ఉల్లంఘనలు, చర్యల్లో జాప్యం, పెద్దలకు ఒకలా, పేదలకు ఒకలా వ్యవహరించే వారిపై విజిలెన్స్ అధికారులు సైతం పర్యటించి, తగిన చర్యలు చేపట్టాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు మారితే తప్ప ఇలాంటివి పునరావృతం కావు.