Mastan Sai | మణికొండ ఫిబ్రవరి 10: డ్రగ్స్ కేసుతో పాటు, అమ్మాయిల అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయికి రాజేంద్రనగర్ కోర్టు పోలీసు కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటికే పలు కీలక విషయాలు వెల్లడవ్వగా.. వీటిపై మరింత లోతుగా తెలుసుకునేందుకు మస్తాన్ సాయిని విచారణ జరపాలని నార్సింగి పోలీసులు భావించారు. ఈ క్రమంలోనే ఐదు రోజుల కస్టడీకి మస్తాన్ సాయిని అప్పగించాలని నార్సింగి పోలీసులు కోరారు. అయితే దీనిపై విచారణ జరిపిన రాజేంద్ర నగర్ కోర్టు రెండు రోజులు మాత్రమే కస్టడీకి అనుమతినిచ్చింది.
రాజేంద్రనగర్ కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13వ తేదీన మస్తాన్ సాయిని నార్సింగ్ పోలీసులు కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నెల 15వ తేదీ వరకు మస్తాన్ సాయి పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. సినీ హీరో రాజ్ తరుణ్ వ్యవహారంలో లావణ్య ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు ఇటీవల మస్తాన్ సాయిని అరెస్టు చేశారు. కోకాపేటలోని పావని బౌల్డర్ విల్లాలో ఆయన్ను అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఈ క్రమంలో అతని ఇంటి నుంచి ఓ హార్డ్ డిస్క్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఫిర్యాదు చేసిన సమయంలో లావణ్య కూడా మరో హార్డ్‌డిస్క్‌ను అందజేసింది. వీటిని పరిశీలించిన పోలీసులు వందలాది మంది అమ్మాయిల అశ్లీల వీడియోలు ఉన్నట్లు గుర్తించారు.