‘గులాబ్’ తుపాను ప్రభావంతో గ్రేటర్లో కుంభవృష్టి కురుస్తోంది. తుపాను తీరందాటి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడడంతో రాగల రెండు రోజులు పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు కురిసే అవకాశాలున్నట్లు హైదారబాద్ వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. వానల తీవ్రత దృష్ట్యా మహానగరానికి ‘ఆరెంజ్’ అలర్ట్తో కూడిన హెచ్చరికలు జారీ చేశారు. టీఎస్డీపీఎస్ అధికారులు అందించిన వివరాల ప్రకారం రాత్రి 8గంటల వరకు రాజేంద్రనగర్లోఅత్యధికంగా 10.18సెం.మీల వర్షపాతం నమోదైంది. ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ఎంఎస్ మక్తా, బీఎస్ మక్తా, ఖైరతాబాద్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు బస్తీలు నీటమునిగాయి.
గతేడాది అనుభవం దృష్ట్యా ప్రధానంగా నీట మునిగిన ఆ ఎనిమిది ప్రాంతాలపై యంత్రాంగం దృష్టి సారించింది. విస్తారంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో 20 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను నియమించారు. జోనల్ పరిధిలో 14 బోట్లతో పాటు శిక్షణ పొందిన 350 మంది డీఆర్ఎఫ్ బృందాలు క్షేత్రస్థాయిలో సిద్ధంగా ఉంచారు. ప్రజలకు ఏవైనా ఇబ్బందులు ఉంటే కంట్రోల్ రూమ్ నెంబరు 040-29555500, 9000113667లో సంప్రదించాలని ఈవీడీఎం విభాగం అధికారులు తెలిపారు.