సిటీబ్యూరో, జూలై 3(నమస్తే తెలంగాణ): కల్తీ ఆహార ఉత్పత్తులు, పదార్థాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. సంబంధిత అధికారుల పర్యవేక్షణ, నిఘా లోపాన్ని ఆసరాగా చేసుకుని గ్రేటర్ పరిధిలో కల్తీ, నకిలీ ఆహార ఉత్పత్తి కేంద్రాలు విచ్చలవిడిగా పెరిగిపోతున్నాయి. హానికరమైన రసాయన పదార్థాలు, నాణ్యతలేని, అపరిశుభ్రమైన పదార్థాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులతో క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులు, కాలేయ సంబంధిత వ్యాధులు, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం లేకపోలేదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మరికొన్ని మాఫియాలు నకిలీ పదార్థాలతో ప్రజలకు నిలువునా మోసగించడమే కాకుండా వారి ప్రాణాలతో చలగాటమాడుతున్నారు. అయితే సంబంధిత అధికారులు కల్తీ ఆహార తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలపై నిఘా పెట్టకపోవడం, పర్యవేక్షణ లేకపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో విక్రయిస్తున్న 50శాతం ఉత్పత్తులు కల్తీవే అని తెలుస్తున్నది.
ఒక్కరోజే 46 కేంద్రాలపై దాడులు
రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో పెద్దఎత్తున కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలను గుర్తించి, బుధవారం ఒక్కరోజే 46 కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలపై ఎస్ఓటీ పోలీసులు దాడులు చేశారు. ఎల్బీనగర్ జోన్ పరిధిలో జరిపిన దాడుల్లో 11 కల్తీ నెయ్యి తయారీ కేంద్రాలను గుర్తించి 575 లీటర్ల కల్తీ నెయ్యిని సీజ్ చేశారు. మహేశ్వరం జోన్ పరిధిలో 8 కల్తీ అల్లం, వెల్లుల్లి తయారీ కేంద్రాలను గుర్తించి 3946 కిలోల కల్తీ అల్లం పేస్ట్‌ను సీజ్ చేశారు.
మల్కాజిగిరి జోన్ పరిధిలో 9 కల్తీ అల్లం తయ్యారీ కేంద్రాలపై దాడులు జరిపి 3037 కిలోల అల్లం పేస్ట్‌ను సీజ్ చేశారు. భువనగిరిలో 18 కల్తీ పన్నీర్ తయారీ కేంద్రాలపై దాడులు జరిపి 35 కిలోల పన్నీర్, 250 కిలోల మిక్చర్ పదార్థాలను సీజ్ చేశారు. వీటితోపాటు ఇమ్యూనిటీ బూస్టింగ్ విటమిన్, ప్రొటీన్ మాత్రలు, పౌడర్, కల్తీ పాలు, కల్తీ పసుపు, ధనియా పౌడర్, కల్తీ స్వీట్స్, బిస్కెట్స్, ఐస్‌క్రీమ్, మినరల్ వాటర్, బేకరీ పదార్థాలను సైతం సీజ్ చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు.
52 మంది అరెస్ట్
ఎఫ్ఎస్ఎస్ఏఐ అనుమతి లేకుండా ఆహార పదార్థాలు తయారు చేయడం, ట్రేడ్‌లైసెన్స్ లేకుండా ఈ ఉత్పత్తులను మార్కెట్లో విక్రయించడం, అపరిశుభ్రత వాతావరణంలో ఆహార ఉత్పత్తులను తయారు చేయడం, ఈ తయారీ కేంద్రాల్లో బాల కార్మికులతో వెట్టి చాకిరీ చేయించడం, ఆహార పదార్థాల తయారీలో గడువు తీరిన ముడి సరుకును వినియోగించడం, ఉత్పత్తులపై మ్యానుఫ్యాక్చరింగ్, ఎక్స్పైరీ తేదీలను ముద్రించకపోవడం తదితర నేరాలకు పాల్పడిన 46 కల్తీ ఆహార ఉత్పత్తి కేంద్రాలపై కేసులు నమోదు చేసి, 52 మందిని అరెస్టు చేసినట్లు సీపీ సుధీర్‌బాబు తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే విధంగా కల్తీ, నకిలీ ఆహార పదార్థాలు తయారు చేస్తున్నా.. విక్రయిస్తున్నట్లు తెలిసినా వెంటనే 87126 62666 నంబర్‌కు సమాచారం అందించాల్సిందిగా పోలీసులు సూచించారు.