సిటీబ్యూరో, మార్చి 30 (నమస్తే తెలంగాణ): తెలుగు నూతన సంవత్సరం ప్రారంభం, తొలి పండుగ ఉగాది పర్వదినం సందర్భంగా ప్రజలకు రాచకొండ సీపీ సుధీర్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. పండుగ వేళల్లో అందరూ మత సామరస్యాన్ని కాపాడేందుకు తోడ్పాటునందించాలని కోరారు. ఆదివారం ఉగాది పండుగ పూర్తి కాగానే సోమవారం రంజాన్ పండుగ జరుగనున్నది.
ఈ నేపథ్యంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో కమిషనరేట్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేకంగా రంజాన్ రోజు భారీ సంఖ్యలో ముస్లింలు పాల్గొని సామూహిక ప్రార్థనలు చేస్తారు. ఆయా మసీద్, ప్రార్థనలు చేసే మైదానాలలో పోలీసులు డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించారు.
మరో పక్క వాహనాలు కూడా తనిఖీ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేయడంతో ముమ్మరంగా శివారు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. భువనగిరి జోన్‌లోని యాదగిరిగుట్ట ప్రాంతాలు, భువనగిరి, సరూర్‌నగర్, ఉప్పల్ మున్సిపల్ స్టేడియం, బాలాపూర్ దర్గా ప్రాంతాల్లో పోలీసు బృందాలు ముమ్మర తనిఖీ చేశారు.