Telangana Diagnostics | సిటీబ్యూరో, మే16, (నమస్తే తెలంగాణ): అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. వేలకు వేలు పెట్టి పరీక్షలు చేయించుకోలేక ఇబ్బందులు పడుతున్న రోగులకు తెలంగాణ డయాగ్నస్టిక్స్ వరంగా మారింది. పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యంతో పాటు, పరీక్షలు కూడా అందించేందుకు 2018లోనే కేసీఆర్ సర్కార్ ముందడుగు వేసింది. నాటి కేసీఆర్ దూరదృష్టి ఫలితంగా పేద ప్రజలకు ఉచితంగా రక్త, మూత్ర పరీక్షలు, థైరాయిడ్, లివర్, కిడ్నీ, హార్మోన్, క్యాన్సర్ స్క్రీనింగ్, ఈసీజీ, ఆల్ట్రాసౌండ్, మామోగ్రాం వంటి 134 రకాల పరీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ)పరిధిలో ఉన్న సుమారు 476 బస్తీ దవాఖానలు, యూపీహెచ్సీలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులకు వివిధ రకాల రోగాలతో వచ్చేవారినుంచి అవసరమైన పరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి నారాయణగూడ ఐపీఎంలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్కు పంపిస్తున్నారు. ఇందులో బయోకెమిస్త్రీలో 56 పరీక్షలు, పాథాలజీలో 37, మైక్రోబయాలజీలో 41 రకాల పరీక్షలు నిర్వహిస్తుండటం గమనార్హం. ప్రతిరోజు 476 ఆసుపత్రుల నుంచి 8000కు పైగా శాంపిల్స్ వస్తుండగా, ఏడాదికి 13లక్షల మంది ఉచిత పరీక్షలు చేయించుకుంటున్నారు.
నారాయణగూడకు చెందిన శ్రీనుకు రక్తకణాలు తగ్గడంతో దగ్గరలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం( యూపీహెచ్సీ)లో చేరాడు. వెంటనే వైద్యులు రక్తపరీక్షల కోసం శాంపిల్స్ సేకరించి టెస్టుల కోసం నారాయణగూడ ఐపీఎంలో ఉన్న తెలంగాణ డయాగ్నోస్టిక్స్ సెంటర్కు పంపించారు. అందులో రూపాయి ఖర్చు చేయకుండానే అవసరమైన పరీక్షలు నిర్వహించి రిపోర్టులు అందించారు.
సనత్ నగర్లో ఉండే హసీనా థైరాయిడ్ సమస్యతో బాధపడుతోంది. ప్రైవేట్లో టెస్టులు చేయించుకునే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల సలహా మేరకు తెలంగాణ డైయాగ్నోస్టిక్స్లో టెస్టులు చేయించుకుంది. రూపాయి కట్టకుండానే 24 గంటల్లోపే రిపోర్టులు పొందింది.
బీఆర్ఎస్ పాలనలోనే ఉచితంగా ..
కేసీఆర్ దూరదృష్టి పేదలకు వరంగా మారింది. సామాన్యులు వైద్య పరీక్షలు చేయించుకోవాలంటే జిల్లా ఆసుపత్రి లేదా అందుబాటులో ఉన్న ప్రైవేట్ డయాగ్నస్టిక్స్ కు వెళ్లేవారు. ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించేందుకు పరికరాల కొరత కారణంగా తిరిగి చేతినుంచి డబ్బులు పెట్టి ప్రైవేట్లోనే చేయించుకునేవారు. బీఆర్ఎస్ పాలనలోనే ఉచితంగా పరీక్షలు సామాన్యుల చెంతకు చేరడం విశేషం.