QR Code | మేడ్చల్, ఫిబ్రవరి 26 : దేశం డిజిటల్ ఇండియాగా మారిపోయింది. నగదు చెల్లింపులు కూడా ఆన్లైన్లోనే అధికమైపోయాయి. చివరకు చాయ్ తాగినా కూడా ఆ పైసలను కూడా ఆన్లైన్లోనే చెల్లిస్తున్నారు. దీంతో చిల్లర పైసలు జేబులో ఉండే పరిస్థితి లేదు. ఇది కాస్త యాచకులకు ఇబ్బందిగా మారింది. దానం చేసే గుణం ఉన్నా జేబులో డబ్బులు లేకపోవడంతో ఇవ్వడం లేదు.
ఈ నేపథ్యంలో బుధవారం మేడ్చల్ పట్టణంలోని కేఎల్ఆర్ వెంచర్‌లోని శివాలయానికి శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఓ వ్యక్తి గంగిరెద్దును తీసుకు వచ్చాడు. ఇక ఆ గంగిరెద్దు ముఖానికి క్యూఆర్ కోడ్‌ను తగలించాడు. ఆలయం నుంచి బయటికి వస్తున్న భక్తులకు గంగిరెద్దుతో దీవెనలు ఇప్పిస్తూ చేతిలో నగదు లేకపోతే ఆన్లైన్లో డబ్బులు ఇవ్వాలని కోరాడు. ఈ దృశ్యాన్ని చూసిన పలువురు డిజిటల్ ఇండియా మహాత్యం అని చర్చించుకోవడం కన్పించింది.