జగద్గిరిగుట్ట : జగద్గిరిగుట్ట డివిజన్లోని హెచ్ఎండీఏ స్థలంలో వ్యర్థాల డంపింగ్‌కు అడ్డుకట్టపడింది. ‘హైడ్రా పేరిట వసూళ్లు’ శీర్షికతో ‘ నమస్తే’లో ప్రచురితమైన కథనంతో సంబంధిత వ్యక్తుల్లో కదలిక వచ్చింది. వ్యర్థాలు తరలించే వాహనాలు లోపలికి వెళ్లకుండా ప్రవేశ మార్గంలో కర్రలు, చెక్కలు అడ్డుపెట్టారు. స్థలం వద్ద అనధికార వ్యక్తులను తొలగించి.. ప్రైవేటు సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. కొన్ని నెలలుగా ఇక్కడ హైడ్రా కూల్చిన వ్యర్థాల పోస్తున్నామంటూ.. నమ్మ బలుకుతూ ,అక్రమ నిర్మాణ వ్యర్థాలను ట్రాక్టర్లు , టిప్పర్లతో డంపు చేస్తున్నారు. ట్రిప్పుకి రూ.300 నుంచి 500 రోజుకు సుమారు రూ. లక్ష మేర సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని నెలలుగా సాగిన వసూళ్ల తతంగం వెనుక ఓ కానిస్టేబుల్, హోంగార్డుతో పాటు హెచ్ఎండీఏలో సివిల్ వర్క్ చేసే కాంట్రాక్టర్ పాత్ర ఉన్నట్లు తెలుస్తున్నది.