సిటీ బ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ శివారులోని గోపన్‌పల్లిలో తక్కువ ధరకు ప్లాట్లు ఇప్పిస్తానని ప్రీలాంచ్ పేరిట జయత్రి రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మోసం చేసిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వందలాది మంది మధ్యతరగతి ప్రజల నుంచి దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూలు చేసి ముఖం చాటేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జయత్రి కంపెనీ తమను ఆకర్షణీయమైన బ్రోచర్లు, ప్రీ లాంచ్ ఆఫర్లతో డిస్కౌంట్ ధరలకు ప్రైమ్ ప్లాట్లను ఇస్తామని నమ్మబలికిందని బాధితులు ఆరోపిస్తున్నారు. వీరికి కేపీహెచ్‌బీ కాలనీ 6వ ఫేజ్ వద్ద100 మందికి పైగా ఉద్యోగులతో కూడిన విలాసవంతమైన కార్పొరేట్ కార్యాలయం చూపించడంతో పెద్ద సంస్థ అని నమ్మామని అంటున్నారు. రెండేళ్లలోపు ప్లాట్లను అప్పగిస్తామంటే రూ. 20 లక్షల నుంచి రూ.1.8 కోట్ల వరకు వివిధ దశల్లో చెల్లించామని చెబుతున్నారు.
గడువు ముగిసినా వివిధ రకాల సాకులు చూపిస్తూ కాలం గడుపుతున్నారని అన్నారు. ప్రధాన నిందితుడు కాకర్ల శ్రీనివాస్, మరో 19 మంది డైరెక్టర్లతో కలిసి ఫిబ్రవరి 2021లో జయత్రి గ్రూప్‌ను స్థాపించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే హిల్టన్ జయ డైమండ్ పేరుతో ఇప్పటికే భారీ వెంచర్‌ను ప్రారంభించి మోసానికి పాల్పడి సంస్థకు చెందిన శ్రీనివాస్‌తో పాటు మరికొందరు అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై బయటకు వచ్చినట్లు వారు చెబుతున్నారు. ఇదే సంస్థ గతంలో రాజమండ్రిలో ఇలాంటి మోసానికే పాల్పడిందని బాధితులు తెలిపారు.
పోలీసులు, ఈడీకి ఫిర్యాదు..
జయతి గ్రూప్ మోసంపై ఇప్పటికే పోలీసులు, ఈడీ, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వర్మ కుమార్, మూర్తి, ప్రసాద్, గణేశ్ తదితరులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు జోక్యం చేసుకుని, నిందితులను అరెస్టు చేసి, వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని, న్యాయం జరిగేలా చూడాలని వారు కోరారు. తాము మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చామని, తామ పెట్టిన ప్రతి రూపాయి కష్టపడి సంపాదించినదేనని అన్నారు.