తెలుగు యూనివర్సిటీ, అక్టోబర్ 29: సామాజిక స్పృహతో కూడిన గొప్ప రచనలు రావాలని మణిపూర్ కేంద్రియ విశ్వ విద్యాలయం వైస్ చాన్స్‌లర్ ఆచార్య టి.తిరుపతి రావు అన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2018వ సంవత్సరానికి గాను తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలల్లో ఉత్తమ గ్రంథాలకు సాహితీ పురస్కారాల ప్రదానోత్సవం వర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య టి.కిషన్‌రావు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. అనంతరం ఆచార్య టి.తిరుపతిరావు మాట్లాడుతూ, సమాజంలోని అంశాలపై స్పందించి రచనలు చేయడం వల్ల ఇతరులకు ప్రేరణ కలుగుతుందన్నారు. ఈ సందర్భంగా కాంచనపల్లి గోవర్ధన్రాజు, సామలేటి లింగమూర్తి, రావులపాటి సీతారాంరావు, గడ్డం మోహనరావు, కిన్నెర శ్రీదేవి, ఎన్.ఎస్ నారాయణబాబు, కె.సజయ, లక్ష్మణరావు, సమ్మెట ఉమాదేవిలను రూ.20,116 చొప్పున నగదు పురస్కారాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ ఏనుగు నర్సింహారెడ్డి, శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం పూర్వ ఉపాధ్యక్షులు ఆచార్య కొలకలూరి ఇనాక్, తెలుగువర్సిటీ ఇన్చార్జి రిజిస్ట్రార్ మురళీకృష్ణ, విస్తరణ సేవా విభాగం ఇన్చార్జి రింగు రామ్మూర్తి పాల్గొన్నారు.