సిటీబ్యూరో, నవంబర్ 10(నమస్తే తెలంగాణ): ఢిల్లీ పేలుడు ఘటనతో గ్రేటర్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉగ్రదాడులకు కుట్ర పన్నిన వారిలో నగరానికి చెందిన ఒక వైద్యుడిని అరెస్టు చేసిన మూడు రోజులకే దేశ రాజధానిలో భారీ పేలుడు సంభవించడం, గతంలోనూ పట్టుబడిన ఉగ్రవాదుల మూలాలు నగరంతో ముడిపడి ఉన్న దృష్ట్యా కేంద్ర నిఘావర్గాల హెచ్చరికల నేపథ్యంలో ట్రై కమిషనరేట్ల పరిధి హైఅలర్ట్ ప్రకటించారు.
ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాలు, జనావాసాలు అధికంగా ఉండే ప్రాంతాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎంజీబీఎస్, జేబీఎస్ బస్స్టేషన్లు, నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లతో పాటు పాతబస్తీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. అప్రధాన రహదారులు, కూడళ్లు, చారిత్రాత్మక కట్టడాలు, ఆలయాలు, ఐటీ కారిడర్, పారిశ్రామికవాడ, మెట్రో స్టేషన్ల వద్ద నిఘా పెంచి సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు.
అనుమానాస్పద వస్తువులు కనిపిస్తే జాగ్రతగా ఉండాలని, వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. బాంబు, డాగ్ స్కాడ్, బాంబు డిస్పోజల్ బృందాలు రంగంలోకి దిగాయి. మరోవైపు మూడు రోజుల క్రితం గుజరాత్ ఏటీఎస్ బృందాలు అరెస్టు చేసిన రాజేంద్రనగర్వాసి డాక్టర్ అహ్మద్ మోహినుద్దీన్ సయీద్ నివాసంలోనూ నిఘా వర్గాలు తనిఖీలు చేసినట్టు సమాచారం. అతడి సన్నిహితులపై పోలీసులు ఆరా తీస్తున్నట్టు తెలిసింది.