సిటీబ్యూరో, ఆగస్ట్ 26(నమస్తే తెలంగాణ): నగరంలో వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దృష్టి పెట్టాలని ట్రాఫిక్ ఉన్నతాధికారులకు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు జారీచేశారు. ఈమేరకు ఆయన మంగళవారం లాఅండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాల అధికారులకు పలు సూచనలు చేశారు. ట్రాఫిక్ విభాగం డీసీపీ, ఏసీపీ, ఇన్స్పెక్టర్లు క్షేత్రస్థాయిలో సిబ్బందితో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో ఖచ్చితంగా ఉన్నతాధికారులు నగరంలో పరిస్థితులను సమీక్షించాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని చెప్పారు. కొత్తగా నియమించిన 100 మంది మార్షల్స్‌ను కమర్షియల్ ప్రాంతాలు, ఆస్పత్రులు, రద్దీ ప్రాంతాల్లో విధుల్లో కేటాయించడంతో పాటు ఎక్కడైనా వాహనాలు మొరాయించి ట్రాఫిక్ జామ్ జరిగే పరిస్థితులు ఉంటే వాటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని సీపీ.. అధికారులను ఆదేశించారు.
శాంతియుతంగా జరుపుకోవాలి..
మిలాద్ ఉన్ నబీ , వినాయక చవితి పండుగ తేదీలు దగ్గరగా ఉండటంతో శాంతియుతంగా వేడుకలు జరుపుకునేలా పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ట్రై కమిషనరేట్ పరిధిలో సుమారు 30వేల మంది పోలీసులను మోహరిస్తున్నట్లు సమాచారం. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మిలాద్జులూస్ కమిటీతో సమావేశమైన పోలీసులు 5వ తేదీన మిలాద్‌ఉన్‌నబీ, 6వ తేదీన నిమజ్జనం ఏర్పాట్లకు సంబంధించి చర్చించారు. నగరంలో సున్నితమైన ప్రదేశాలను గుర్తించి వాటివద్ద బందోబస్త్ ఎక్కువగా పెట్టాలని నిర్ణయించారు. వినాయ విగ్రహాల ప్రతిష్ట మొదలు నిమజ్జనం వరకు గణపతి నవరాత్రులు ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
నిర్వాహకులకు పోలీసుల సూచనలు..
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో జోన్ల వారీగా పీస్ కమిటీలతో ఆయా జోన్ల డీసీపీలు సమన్వయ సమావేశాలు నిర్వహించారు. విగ్రహ ప్రతిష్ట నుంచి నిమజ్జనం వరకు మండపాల్లో వలంటీర్లు 24 గంటలు అందుబాటులో ఉండాలని, మండపాల్లో ఫైర్ ఎగ్జిష్టర్లు, ఇసుక బిందెలు తప్పనిసరిగా ఉంచుకోవాలని నిర్వాహకులకు సూచించారు. మండపాల్లో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, రాత్రివేళల్లో మండపం ఖాళీగా ఉండకూడదని, నగదు, ఆభరణాలు, విలువైన వస్తువులు భద్రంగా ఉంచాలని తెలిపారు.
భక్తులు అధికసంఖ్యలో వచ్చే అవకాశమున్నందున బ్యారికేడ్లు, క్యూలైన్లు తప్పనిసరిగా ఉండాలని, మహిళలకు ప్రత్యేక క్యూలైన్ ఉండాలని , ప్రవేశం, బయటకు వెళ్లే దారులు వేర్వేరుగా ఉండాలని సూచించారు. అసభ్యకరమైన కార్యక్రమాలు, రెచ్చగొట్టే ప్రసంగాలు ఉండకూడదని.. కార్యక్రమాలన్నీ భక్తి, సంస్కృతి ప్రతిబింబించేలా ఉండాలని తెలిపారు.
నిమజ్జనానికి ముందుగానే వాహనాలు సిద్ధం చేసుకోవాలని, ఒక విగ్రహానికి ఒక వాహనం మాత్రమే అనుమతిస్తామని, వాహనం విగ్రహం పరిమాణానికి తగ్గట్లుగా ఉండాలని పోలీసులు మండప నిర్వాహకులకు సూచించారు.. డీజేలు, లౌడ్నాయిస్ ఎక్విప్మెంట్, ఫైర్ క్రాకర్స్ పూర్తిగా నిషేధమని, మద్యం, మత్తు పదార్థాల ప్రభావంలో ఊరేగింపులో పాల్గొనవద్దని, కర్రలు, కత్తులు, ఫైర్ కారక వస్తువులు, ఇతరులపై రంగులు చల్లడం, రాజకీయ, రెచ్చగొట్టే నినాదాలు చేయడం నిషేధమని పోలీసులు తెలిపారు. మిలాద్ సందర్భంగా కూడా ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని, ర్యాలీని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.