మియాపూర్ , నవంబర్ 12: మియాపూర్‌లో ఫుట్‌పాత్‌లపై విక్రయాలు జరుపుకునే చిరువ్యాపారులపై ట్రాఫిక్ పోలీసులు తమ జులుం చూపించారు. మియాపూర్ మెట్రో సమీపంలోని ఫుట్‌పాత్‌పై కొందరు నిరుపేదలు సోఫాలు విక్రయించుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. వారి వ్యాపారాల కారణంగా రోడ్డుపై ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నదనే కారణంతో మియాపూర్ ట్రాఫిక్ సీఐ ప్రశాంత్ ఆధ్వర్యంలో బుధవారం సిబ్బంది.. వారి దుకాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగింపజేశారు.
వారు ఎంత ప్రాధేయపడినప్పటికీ కనికరించని ఖాకీలు.. సోఫాలు, ఇతర సామగ్రిని చెల్లాచెదరు చేశారు. నిబంధనల పేరుతో చిరువ్యాపారులపై ఖాకీలు చూపించని కర్కశత్వం చూసిన స్థానికులు ముక్కునవేలేసుకున్నారు. బడాబాబులు రోడ్లను ఆక్రమించుకొని నిర్మాణాలు చేపట్టినప్పటికీ పట్టించుకోని పోలీసులు .. చిరువ్యాపారులపై తమ ప్రతాపం చూపించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.