సిటీబ్యూరో,వెంగళరావునగర్, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గణేశ్ నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా చూడాలని, అందుకు తగిన భద్రతపై రోజువారీ సమీక్ష జరపాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశించారు. సోమవారం వివిధ జోన్ల లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ అధికారులతో సీవీ.ఆనంద్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా నిమజ్జనం సాఫీగా సాగేందుకు తీసుకోవలసిన భద్రతా చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూసుకోవాలని ఆనంద్ చెప్పారు. అసాంఘిక శక్తులు, పిక్ పాకెటర్లు, ఈవ్‌టీజర్లు, గొలుసు దొంగతనం వంటి నేరాలను నివారించడానికి స్థానిక పోలీసులు, షీటీమ్, వాలంటీర్లు నిరంతరం నిఘా ఉంచాలని చెప్పారు. రాత్రిపూట విగ్రహాల వద్ద నిర్వాహకులు, వాలంటీర్లు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలని, గణేశ్ విగ్రహాలను త్వరగా నిమజ్జనం చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికపై చర్చించాలని తెలిపారు.
గణపతి మండపాల నిర్వాహకులు కూడా సాధ్యమైనంత త్వరగా నిమజ్జనానికి బయలుదేరి, క్షేమంగా ఇల్లు చేరుకోవాలని సూచించారు. మధురానగర్ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సమావేశంలో సీవీ.ఆనంద్‌తో పాటు వెస్ట్‌జోన్ డీసీపీ విజయకుమార్, ఎస్బీ డీసీపీ అపూర్వరావు, ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌హెగ్డే, టాస్క్‌ఫోర్స్ అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్దిఖి తదితర అధికారులు పాల్గొన్నారు.
నగరంలో విగ్రహాలు 11,526
సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఏడుజోన్లలో మొత్తం 11,724 వినాయక విగ్రహాల కోసం దరఖాస్తులు రాగా అందులో 11,526 విగ్రహాలకు అనుమతి ఇచ్చారు. ఈ మొత్తం విగ్రహాలను జియోట్యాగింగ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈస్ట్‌జోన్‌లో 2276, నార్త్‌జోన్‌లో 1832, వెస్ట్ జోన్లో 1808, సౌత్‌వెస్ట్ జోన్లో 1750, సౌత్జోన్లో 1462, సౌత్ఈస్ట్ జోన్లో 1216, సెంట్రల్ జోన్లో 1182 విగ్రహాలు నమోదైనట్లుగా వారు పేర్కొన్నారు. అయితే కొన్ని విగ్రహాలు పోలీసుల వద్ద నమోదు కాలేదని, వాటి నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు అధికారులు సూచించారు.