Double Murder | సిటీబ్యూరో, జనవరి 16 (నమస్తే తెలంగాణ): నగరంలో కలకలం సృష్టించిన నార్సింగి జంట హత్యల కేసును పోలీసులు చేధించారు. మృతురాలు ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియో తీయొద్దని హెచ్చరించినందుకు కక్ష గట్టిన నిందితుడు ఈ జంట హత్యలకు పాల్పడినట్టు పోలీసులు వెల్లడించారు. రాజేంద్రనగర్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్ కథనం ప్రకారం.. మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్, ఛత్తీస్‌గఢ్ చెందిన బిందుల మధ్య వివాహేతర సంబంధం ఉండేది. ఇదే క్రమంలో అంకిత్ ద్వారా మధ్యప్రదేశ్‌కే చెందిన రాహుల్ సాకేత్‌తో బిందుకు సాన్నిహిత్యం ఏర్పడింది. ఇద్దరూ ఏకాంతంగా ఉన్న సమయంలో రాహుల్.. బిందు వీడియోను రికార్డు చేసేందుకు యత్నించగా ఇందుకు ఆమె అభ్యంతరం చెప్పింది. వద్దని బిందు వారించినప్పటికీ రాహుల్ పలుమార్లు ఆమె వీడియో తీసేందుకు పదే పదే యత్నించాడు.
ఈ విషయమై రాహుల్‌ను అంకిత్ తీవ్రంగా మందలించాడు. మరోమారు ఇలా చేస్తే తగదని కూడా హెచ్చరించాడు. దీంతో అంకిత్‌పై రాహుల్ కక్ష గట్టి అతడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం తన స్వస్థలానికి చెందిన రాజ్‌కుమార్ సాకేత్, సుకేందర్ సాకేత్‌ల సహాయం కోరాడు. పథకం ప్రకారం ఈ నెల 8న అంకిత్‌ను, బిందును నానక్‌రామ్‌గూడకు రప్పించుకున్నారు. అక్కడి నుంచి అందరూ కలిసి ఆటోలోని పుప్పాలగూడలోని పద్మనాభ స్వామి గుట్టపైకి తీసుకెళ్లారు. అక్కడ వారితో ఆ మాటా ఈ మాటా మాట్లాడుతూ.. రాహుల్, రాజ్‌కుమార్‌లు కలిసి అంకిత్‌ను పక్కకు తీసుకెళ్లి కత్తులతో దాడి చేసి బండరాళ్లతో మోది చంపేశారు. అదే సమయంలో సుకేందర్.. బిందును మాటల్లోకి దింపి పక్కకు తీసుకెళ్లాడు. అంకిత్‌ను చంపిన వెంటనే.. రాహుల్, రాజ్‌కుమార్‌లు సుకేందర్తో కలిసి బిందును అతి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత నిందితులు మృతుల సెల్ఫోన్లను తీసుకుని అక్కడి నుంచి తమ స్వస్థలమైన మధ్యప్రదేశ్‌కు పరారయ్యారు.
సెల్ఫోన్లు పట్టించాయి
పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు నిందితులు మృతుల ఫోన్లు తమ వెంట మధ్యప్రదేశ్ తీసుకెళ్లారు. అయితే దర్యాప్తులో భాగంగా పోలీసులు మృతుల సెల్ఫోన్ల గురించి వాకబు చేయగా అవి ఘటనా స్థలంలో లభించలేదు. ఫోన్ నెంబర్ల ఆధారంగా వారి వారి లొకేషన్లు వెతకగా నిందితులు మధ్యప్రదేశ్‌లో ఉన్నట్టు తేలింది. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ప్రత్యేక బృందాన్ని మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాకు వెళ్లి నిందితులను అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మృతుల సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.