బేగంపేట్,జనవరి 21: అగ్నిప్రమాదానికి గురైన డెక్కన్ మాల్ భవనంలో శనివారం ఒక మృతదేహాన్ని గుర్తించగా, మిగతా రెండు మృతదేహాల కోసం శిథిలాల కింద గాలిస్తున్నారు. భవనంలో ఇంకా వేడి తగ్గకపోవడంతో శనివారం కూడా అధికారులు లోపలికి వెళ్లలేకపోయారు. క్లూస్ టీమ్ మొదటి అంతస్తు వరకు వెళ్లి పరిశీలించగా, అక్కడ లిఫ్ట్, షట్టర్ వద్ద ఒక మృతదేహం పూర్తిగా కాలిపోయిన స్థితిలో కనిపించింది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్‌కుమార్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విశ్వజిత్, ఫైర్ అధికారులు పాపయ్య, మధుసూదన్, హైదరాబాద్ క్లూస్ టీం హెడ్, సైంటిస్ట్ వెంకన్న, పోలీసు అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షించారు. బాధిత కుటుంబాలను మంత్రి పరామర్శించారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవనాన్ని కూల్చడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు జీహెచ్ఎంసీ అధికారులు మంత్రికి వివరించారు. కాగా, ఇంకా రెండు మృతదేహాల కోసం గాలిస్తుండడంతో ఈ ప్రక్రియ పూర్తయిన తరువాతే కూల్చివేతలు చేపట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తున్నది. మృతదేహానికి సంబంధించిన కొన్ని అవశేషాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సేకరించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. భవనంలో పూర్తిగా వేడి తగ్గాలంటే మరింత సమయం పట్టే అవకాశాలున్నాయి. గల్లంతైన మరో ఇద్దరి మృతదేహాలు కూడా మొదటి అంతస్తులోనే ఉండే అవకాశాలున్నాయని అధికారులు భావిస్తున్నారు.
పొగతో తప్పించుకోలేని స్థితి..
ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న ఏడుగురిలో నలుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా ముగ్గురు చిక్కుకుపోయారు. మంటలు వ్యాపించి, పొగ కమ్మేయడంతో క్షణాల్లోనే ముగ్గురు పొగను పీల్చి ఉంటారని దీంతో తప్పించుకోలేక కుప్పకూలిపోయి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి వెయ్యి డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అందులో వచ్చి ఉండే అవకాశాలున్నాయని, ఈ క్రమంలో అందులో చిక్కుకున్న వారి శరీరాలు పూర్తిగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. అయితే స్లాబ్‌లు కూలడంతో మిగతా మృతదేహాలు శిథిలాల కింద ఉండే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
25న ఉన్నత స్థాయి సమావేశం
జంట నగరాల్లో ఇలాంటి భవనాలు సుమారు 25వేల వరకు ఉంటాయని అంచనా వేశాం. .. ఇలాంటి ఘటనలు తిరిగి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై అన్ని విభాగాల అధికారులతో ఈనెల 25న ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. అనుమతులు లేని భవనాలు, ఫైర్ సేఫ్టీలేని బిల్డింగ్‌లతో పాటు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై చర్చించనున్నట్టు తెలిపారు.
బస్తీవాసులతో మాట్లాడి..
అగ్ని ప్రమాదం జరిగిన భవనం పక్కనే ఉన్న కాచ్బౌలి బస్తీవాసులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ హామీ ఇచ్చారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఖాళీ చేసిన కాచ్బౌలి బస్తీలో మంత్రి పర్యటించారు. అక్కడికి వచ్చిన బస్తీ వాసులతో మాట్లాడారు. వారి ఇండ్లను సైతం పరిశీలించారు. బస్తీ వాసుల కోసం ఎంజీ రోడ్డులోని మున్నూరు కాపు సంఘం భవనంలో వసతి ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసి అందిస్తున్నట్టు వివరించారు. అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని కూల్చి వేసే వరకు బస్తీలోని ఇండ్లకు ఎవరూ నివాసితులు వెళ్లవద్దని చెప్పారు. వారికి ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు, మందులు అందించేందుకు బస్తీలోనే ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేయిస్తున్నట్టు మంత్రి వివరించారు. బస్తీ వాసుల ఇండ్లకు ఏదైనా నష్టం వాటిల్లితే తానే సొంతంగా మరమ్మతులు చేయించి ఇస్తానని భరోసా ఇచ్చారు.