సిటీ బ్యూరో, ఫిబ్రవరి 12(నమస్తే తెలంగాణ): భాగ్యనగరంలో కాలుష్య స్థాయిలు మళ్లీ పెరిగిపోతున్నాయి. గత 10 రోజుల నుంచి స్థాయిలకు మించి కాలుష్యం వెలువడుతున్నది. దేశంలో కోల్కతాలో అత్యధికంగా కాలుష్య తీవ్రత 155 నమోదు కాగా, గాలి నాణ్యత సూచికలో 128 నమోదై మూడో స్థానంలో ఉండటం ఆందోళనను కలిగిస్తున్నది. గాలిలో సూక్ష్మ, ద్రవరూపంలో ఉండే కణ పదార్థాన్ని(పీఎం) రెండు విభాగాలుగా విభజించారు. అందులో పది మైక్రోకణాలకంటే తక్కువ ఉంటే పీఎం 10 అంటారు. రెండో రకం పీఎం 2.5. ఇవి ప్రధానంగా ఊపిరితిత్తుల సమస్యకు, శ్వాసకోశ సమస్యలకు కారణమవుతాయి.
వీటి స్థాయిలు ఈ నెలలో క్రమంగా మారుతున్నాయి. గాలి నాణ్యత సూచికలో 0-50 వరకు అనుకూలమైనదిగా, 51-100 వరకు ఓ మోస్తరుగా, 101-200 వరకు బలహీనంగా పేర్కొంటారు. 201-300 అధిక కాలుష్యంగా, 301-400 అత్యంత హానికం, 401-500 అత్యంత ప్రమాదకరంగా సూచికలో తెలియజేస్తారు. కాగా, ఈనెల ఒకటి నుంచి 8వ తేదీ వరకు కాలుష్య తీవ్రత పెరిగినట్లుగా గాలి నాణ్యత సూచీలు తెలియజేస్తున్నాయి. నగరంలో ఫిబ్రవరి 1న 112, ఫిబ్రవరి 2న 104, ఫిబ్రవరి 3న 102, ఫిబ్రవరి 4న 108, ఫిబ్రవరి 5న 108, ఫిబ్రవరి 6న 106, ఫిబ్రవరి 7న 125, ఫిబ్రవరి 8న 124, ఫిబ్రవరి 9న 131, ఫిబ్రవరి10న 132, ఫిబ్రవరి11న 127 గా నమోదైంది.
కట్టడి సాధ్యమేనా..
నిత్యం పెరుగుతున్న వాహనాలు వాటి నుంచి వెలువడే పొగ కారణంగానే అత్యధిక శాతం కాలుష్యం ఏర్పడుతున్నది. రవాణాధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 82,45,304 వాహనాలు ఉండగా, అందులో 58,71,539 ద్విచక్ర వాహనాలు, 15లక్షల కార్లు ఉన్నట్లు సమాచారం. ఆవే కాకుండా వేల సంఖ్యలో పరిమితి దాటిన వాహనాలు పట్టణంలో రోడ్లపైకొస్తున్నాయి. వాటి నుంచి వెలువడే పొగ తీవ్రత సైతం కాలుష్యానికి కారణమువుతుంది. నిత్యం పెరుగుతున్న కాలుష్య తీవ్రతను నివారించాలంటే ప్రతి చిన్న పనికి వాహనాలు వాడకుండా నడకమార్గాన్ని ఎంచుకోవాలంటూ పలువురు వైద్యులు సూచనలిస్తుండటం విశేషం.