చేర్యాల, జూన్ 28: సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని పెద్ద చెరువు కట్టపై వన మహోత్సవంలో నాటిన మొక్కలు అప్పుడే ఎండిపోతున్నాయి. మొక్కలు నాటి, ఆ తర్వాత వాటి సంరక్షణపై శ్రద్ధ చూపక పోవడంతో మొక్కలు ఎండిపోతున్నాయి. ఏటా వానకాలంలో మొక్కలు నాటడం, ఆ తర్వాత నిర్వహణ మరువడంతో పెద్ద చెరువు కట్టపై మొక్కలు దక్కడం లేదు. ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఇటీవల వన మహోత్సవ కార్యక్రమాన్ని చేర్యాల పెద్ద చెరువు కట్టపై నిర్వహించారు.
ఈ సందర్భంగా అధికారులు, మున్సిపల్ పాలకవర్గం, సిబ్బందితో కలిసి మొక్కలు నాటారు. కానీ, నాటిన మొక్కల్లో కొన్ని అప్పుడే ఎండిపోతున్నాయి. పెద్ద చెరువు కట్ట సుందరీకరణలో భాగంగా చెరువు కట్టకు ఇరువైపులా నాటిన మొక్కలతో పాటు సహజంగా పెరిగిన చెట్లను కాంట్రాక్టర్ తొలిగించారు. అభివృద్ధి కార్యక్రమం చేపడుతుండడంతో తిరిగి మొక్కలు నాటుతారని భావించిన పట్టణ ప్రజలకు నిరాశే ఎదురైంది. ఉన్న చెట్లను తొలిగించగా, కొత్తగా నాటిన మొక్కలు సైతం ఎండిపోతుండడంతో అధికారుల నిర్లక్ష్యంపై పట్టణ ప్రజలు, ప్రకృతి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మొక్కల సంరక్షణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని పెద్ద చెరువు కట్ట వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఆరోపిస్తున్నారు. మొక్కలను సంరక్షించి, చెరువు పరిసరాలు ఆహ్లాదకరంగా మార్చాలని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు కోరారు.