బంజారాహిల్స్, నవంబర్ 1: మద్యం మత్తులో ఉన్న వ్యక్తికి ప్రమాదవశాత్తూ నిప్పంటుకొని మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. రోడ్ నంబర్ .1లోని హిందూ శ్మశానవాటికలో దీపావళి సందర్భంగా గురువారం రాత్రి నుంచి కొందరు వ్యక్తులు తమ కుటంబసభ్యుల సమాధుల వద్ద దీపాలు వెలిగించారు. అదే ప్రాంతంలో తిరుగుతున్న ఓ గుర్తుతెలియని వ్యక్తి (45) శుక్రవారం ఉదయం 8 గంటల ప్రాంతంలో శ్మశానవాటికలో వళ్లంతా మంటలతో కనిపించాడు. గమనించిన జీహెచ్ఎంసీ స్వీపర్లు జ్యోతి, సీత అతడి వద్దకు వెళ్లి అక్కడున్న బోరింగ్లో నుంచి నీళ్లు తోడి మంటలు ఆర్పేందుకు యత్నించారు.
అయినా మంటలు ఆరకపోవడంతో సదరు గుర్తుతెలియని వ్యక్తి కాలుతున్న శరీరంతోనే రోడ్డుమీదకు పరుగులు పెట్టాడు. దీంతో అటుగా వెళ్తున్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. స్థానికులు అతడి వంటి మీద దుప్పటి వేసి మంటలు చల్లార్చి ఆస్పత్రికి తరలించగా, అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఘటనా స్థలానికి చేరుకున్న బంజారాహిల్స్ పోలీసులు విచారణ చేపట్టారు. మద్యంతో మత్తులో సమాధుల వద్ద పెట్టిన దీపానికి తాకడంతో దానిలోని నూనె ఒలికిపోయి మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.