ధరణి పోర్టల్‌తో విప్లవాత్మక మార్పు వస్తున్నది. భూ సమస్యలు శరవేగంగా పరిష్కారమవుతుండటంతో అన్నదాతల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. మేడ్చల్ జిల్లాలో సుమారు 80 శాతం దరఖాస్తులు పరిష్కారమయ్యాయి. కలెక్టరేట్లో ధరణి సెల్ ఏర్పాటు చేశారు. ఈ సెల్‌ను సంప్రదించిన అర్జీదారులకు దరఖాస్తుకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తున్నారు. ఇంత మంచి పోర్టల్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రైతులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
మేడ్చల్, మే27(నమస్తే తెలంగాణ): ధరణి పోర్టల్ ఏర్పాటుతో భూముల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ధరణి పోర్టల్‌ను రూపొందించడంతో రైతుల్లో విశ్వాసాన్ని నింపింది. దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు ధరణిలో పరిష్కారమై హక్కు పత్రాలను పొందుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా సుమారు ధరణిలో వచ్చిన దరఖాస్తులకు 80 శాతం దరఖాస్తులు పరిష్కారం అయ్యాయి. కోర్టు కేసులు మినహాయించి అన్ని కేసులను రెవెన్యూ దరఖాస్తులు చేసిన వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.
ధరణి వల్ల భూములకు సంబంధించి మ్యుటేషన్లు తక్షణమే పూర్తయై డిజిటల్ పాసు పుస్తకాలు ఇంటికే పంపిస్తున్నారు. డిజిటల్ స్నిగ్నేచర్, ఫౌతి, పేరుమార్పు, మ్యుటేషన్లు తదితర మ్యాడుల్స్ను ధరణి పోర్టల్‌లో ప్రభుత్వం పొందుపరించింది. వివిధ మ్యాడుల్స్ ద్వారా రైతులు తమ సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. ధరణితో మోసాలను అరికట్టినట్లయింది. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే చాలు తమ భూమి సమస్యలు పరిష్కారం అవుతున్నట్లు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి పోర్టల్ తీసుకవచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Hyd12
కలెక్టరేట్లో ధరణి సెల్ ఏర్పాటు..
ధరణి సమస్యలతో వచ్చే రైతుల సౌకర్యం కోసం జిల్లా కలెక్టరేట్లో ధరణి పోర్టల్ సెల్‌ను ఏర్పాటు చేశారు. భూ సమస్యల పరిష్కారానికి సంబంధించి దరఖాస్తులు చేసుకున్న రైతులకు సమాచారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా ధరణి సెల్‌ను ఏర్పాటు చేసి సమాచారం అందిస్తున్నారు. సమస్య ఎందుకు పరిష్కారం కాలేదనే విషయాన్ని బాధితులకు వివరించి తిరిగి ఎలా దరఖాస్తు చేయాలో ధరణి సెల్లో ఉన్న సిబ్బంది వివరిస్తున్నారు.
సులువుగా రిజిస్ట్రేషన్లు
ధరణి పోర్టర్ రాకతో రిజిస్ట్రేషన్లు తొందరంగా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు వెళ్లిన రోజే భూమికి సంబంధించిప 1బీ రికార్డులో పేరు ఎక్కడం చాలా సంతోషంగా ఉంది. ధరణి రావడంతో రైతుల భూములకు మరింత భద్రత పెరిగింది. భూమి ఎంత అమ్మితే అంత కట్ అయి మిగిలిన భూమి ఆన్లైన్లో చూపిస్తుంది. గతంలో రికార్డుల్లో చాలా తప్పులు జరుగుతుండేవి. వాటిని సరి చేసుకోవాలంటే తప ప్రాణం తోకకు వచ్చినంత పని అయ్యేది. ఇప్పుడు ఆ బాధలన్నీ పోయాయి. ఇంతటి మార్పు తీసుకువచ్చిన సీఎం కేసీఆర్‌కు రైతుల తరఫున కృతజ్ఞతలు.
– తుడుం ఆగమయ్య రైతు, కీసర
10 నిమిషాల్లో పాసు పుస్తకం
రిజిస్ట్రేషన్ జరిగిన పది నిమిషాల్లో పాస్ పుస్తకం వస్తుంది. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని ఎప్పుడు కూడా అనుకోలేదు. ధరణి పోర్టల్ రావడంతో ఇది సాధ్యమైంది. రిజిస్ట్రేషన్‌తో పాటు అప్పుడే మ్యుటేషన్ కూడా అవుతున్నది. సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపు ఉన్న వ్యక్తి. రైతు బిడ్డగా ఆయనకు రైతులు ఎదుర్కొనే సమస్యలు ఆయనకు తెలుసు. రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ కావడంతో ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగటం, పైరవీలు చేసే బాధ తప్పింది. రోజుల తరబడి వేచి చూడాల్సిన పని లేకుండా అయింది. కేసీఆర్ వల్లే రైతులకు గౌరవం దక్కింది.
– అరక బుచ్చిరెడ్డి, రైతు, అంకుషాపూర్
రైతులకు ఇబ్బందులు తప్పాయి
ధరణి పోర్టల్ రాకతో రైతులకు ఇబ్బందులు తప్పాయి. భూముల వివరాలు ఆన్లైన్లో నమోదు కావడంతో ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా మారింది. రిజిస్ట్రేషన్ తొందరగా జరుగుతున్నాయి. చదువు లేని రైతులు కూడా సులభంగా పని చేసుకోగలుతున్నారు. అన్ని శాఖాల్లో కంటే రెవెన్యూ శాఖ అవినీతి ఎక్కువగా ఉందని, భూముల వల్ల గ్రామాల్లో తగాదాలు కూడా పెరిగాయిని సీఎం కేసీఆర్ గుర్తించారు. అన్ని బాధలకు విముక్తి కల్గించేందుకు ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చారు.
– మెట్టు పరమేశ్ యాదవ్, రైతు, కీసర
ధరణితో రైతుకు మేలు
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ధరణితో రైతుకు మేలు జరిగింది. ధరణి రాక ముందు రెవెన్యూ అధికారులు రైతులను చాలా ఇబ్బంది పెట్టేవాళ్లు. ప్రతి పనికి చేతులు తడిపితే గానీ పని జరుగకపోయేది. రిజిస్ట్రేషన్, పౌతి, మ్యూటేషన్ ఏదైనా చాలా ఇబ్బందిగా ఉండేది. ధరణి రాకతో అన్ని సమస్యలు తొలగిపోయాయి. పైసా ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ జరుగుతున్నది. రిజిస్ట్రేషన్‌తో పాటు మ్యుటేషన్ కూడా జరిగిపోతున్నది. సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. నేను 6 గుంటల భూమి అమ్మినా వెంటనే రిజిస్ట్రేషన్ జరిగింది. కొన్న వారికి, అమ్మిన వారికి ఇబ్బంది లేదు.
– గుంటి కుమార్, రైతు,కోనాయిపల్లి, మేడ్చల్ మండలం
లంచాలు ఇవ్వాల్సిన పని లేదు
ధరణిలో ఒకసారి భూమి నమోదైతే ఏ సమస్య లేదు. రిజిస్ట్రేషన్లకు సేఫ్‌గా ఉంది. వెంబడే పట్టాపాస్ పుస్తకం వస్తుంది కాబట్టి ఎవరికి లంచం ఇవ్వాల్సిన పనిలేదు. స్లాట్‌బుకింగ్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ చేసుకునే డేట్, టైం వస్తుంది. ఆ సమయానికి తాసిల్దార్ ఆఫీస్‌కు వెళ్లి, అర్ధగంటలో పని పూర్తి చేసుకోవచ్చు. ఒకప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే 10 రోజులైనా దాని కోసం తిరగాల్సి వచ్చేది. రిజిస్ట్రేషన్ తర్వాత మ్యుటేషన్ కోసం ఆర్డీవో కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ బాధలన్నీ తప్పాయి.
– మహేశ్, గోసాయిగూడ, మేడ్చల్
భూ సమస్యల పరిష్కార వేదిక ధరణి
భూ సమస్యల పరిష్కార వేదికగా ధరణి పని చేస్తున్నది. రైతుకు డబ్బు, సమయం ఆదా అవుతున్నది. రిజిస్ట్రేషన్ నుండి మ్యుటేషన్, నాలా కన్వర్షన్లకు కార్యాలయాల చుట్టూ నెలల తరబడి తిరగటం, చేతులు తడపటం తప్పింది. అన్ని రకాల రిజిస్ట్రేషన్లు ఆన్లైన్లో జరగటం వల్ల తమ భూముల వివరాలు అమెరికాలో ఉన్నోడికి కూడా తెలుస్తుంది. డబుల్ రిజిస్ట్రేషన్లకు అవకాశమే లేదు.10 నిమిషాల లోపే పట్టాదారు పాసు పుస్తకం రావటంతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారు. ధరణి పోర్టల్ ప్రవేశపెట్టిన సీఎం కేసీఆర్ రుణం రైతులు తీర్చుకోలేనిది.
– చందుపట్ల ధర్మారెడ్డి, రైతు, ఎదులాబాద్