Prank Videos | సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 ( నమస్తే తెలంగాణ) : “నలుగురు అమ్మాయిలు గోల్కొండ కోటను వీక్షిస్తున్నారు. కోటపైకి ఎక్కి పరిశీలిస్తున్నారు. వాళ్లకు ఓ వ్యక్తి ఎదురుగా వచ్చి ఒక్కసారిగా వారిని నెట్టివేయడానికి ప్రయత్నించాడు. ఎవరో సైకో అనుకుని ఆ అమ్మాయిలు తలో దిక్కు పరుగెత్తడానికి ప్రయత్నించారు. ఇంతలో ఆ వ్యక్తి అరుస్తూ.. మేడం ఇది ప్రాంక్. అదిగో చూడండి అక్కడ కెమెరా ఉంది. అంటూ వారికి చెప్పాడు. ఆ అమ్మాయిలో ఇద్దరు ఆ ప్రాంక్‌ను సింపుల్‌గా తీసుకున్నారు.. మరో ఇద్దరు వారిపై సీరియస్ అయ్యారు. ఇలాంటి ప్రాంక్ వీడియోలు షూట్ చేసే ట్రెండ్ నగరంలో పెరిగిపోతుంది. దేశ వ్యాప్తంగా ప్రాంక్ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈ ధోరణి మంచిది కాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. దేశవ్యాప్తంగా పలువురిపై కేసులు కూడా నమోదయ్యాయి. ఇటీవల హైదరాబాద్పోలీసులు ప్రాంక్ వీడియోలు చేసే వారికి హెచ్చరికలు జారీ చేశారు.
అమ్మాయిలనూ ఇబ్బంది పెడుతున్నారు
ప్రాంక్ వీడియో సరదా కోసం చేసినా.. అది తెలియని వారు ఆ క్షణంలో భయభ్రాంతులకు గురవుతారు. ఒక్కోసారి ఏమీ తోచక ఎటువైపో పరిగెత్తే క్రమంలో రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. అకస్మాత్తుగా జనాల్ని భయభ్రాంతులకు గురిచేసే ఇలాంటి ప్రాంక్ వీడియోలను ఇటీవల పార్కులు, సినిమా థియేటర్లు, రద్దీ రోడ్లు తదితర జనారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా షూట్ చేస్తున్నారు. కొంతమంది ప్రయాణిస్తున్న కారుకు ఎదురుగా వెళుతూ డ్రైవర్‌ను ఆటపట్టించే ప్రాంక్ వీడియో చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. యూట్యూబ్‌లో అప్లోడ్ చేసిన ప్రాంక్ వీడియోలను జనం ఎక్కువగా చూస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ప్రాంక్ వీడియోలకు వీక్షకులు ఎక్కువగా ఉంటారు. లైకులు లక్షల్లో ఉంటాయి. ఈ స్థితినే కొంతమంది యూట్యూబ్ చానెళ్ల వారు క్యాష్‌గా మలుచుకోవటానికి ప్రయత్నిస్తున్నారు. ప్రాంక్ వీడియోలకు ఆదరణ ఎక్కువగా వస్తే ప్రకటనలు తద్వారా ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో నిర్వాహకులు మరింత రెచ్చిపోతున్నారు.ఎక్కువమందిని ఆకర్షించేందుకు ఏకంగా నడిరోడ్డుపైనే ఆకతాయి పనులు చేస్తున్నారు. ఒంటరిగా వచ్చే అమ్మాయిలను ప్రాంక్ పేరుతో కొంతమంది పోకిరీలు ఇబ్బంది పెట్టిన సంఘటన ఇటీవల ఇందిరాపార్కు వద్ద జరిగింది. ఓ బాధిత మహిళ.. లేక్ పెట్రోలింగ్ పోలీసులను పిలవడానికి ప్రయత్నించడంతో అక్కడి నుంచి ఆ ప్రబుద్ధులు జారుకున్నారు. కాలేజీ, ఆసుపత్రి, దేవాలయాలలో కూడా ప్రాంక్ వీడియోలు చేస్తూ జనాలను అవమనాపరిచే గ్యాంగ్‌లు పెరుగుతున్నాయి.
జనం మధ్యనే ప్రాంక్‌లు