సిటీబ్యూరో, డిసెంబర్ 26 (నమస్తే తెలంగాణ): పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లపై ఎలాంటి డిస్కౌంట్లు లేవని నగర అదనపు సీపీ(ట్రాఫిక్) విశ్వప్రసాద్ స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ ఈ-చలాన్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్లు సోషల్ మీడియాతో పాటు పలు ఇతర ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని అదనపు సీపీ వివరించారు.
పెండింగ్‌లో ఉన్న ఈ-చలాన్లపై తెలంగాణ పోలీసు శాఖ ఎలాంటి డిస్కౌంట్లు ప్రకటించలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు సమాచారాన్ని ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా ఆన్లైన్ ప్లాట్‌ఫార్మ్‌లలో వచ్చే సమాచారం సరైనదో కాదో నిర్ధారణ చేసుకోకుండా దానిని వాట్సాప్ గ్రూపుల్లో, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల్లో సర్క్యులేట్ చేయడం నేరమని, తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదైన సమాచారాన్ని తెలుసుకోవాలన్నా లేక నిజ నిర్ధారణ చేసుకోవాలన్నా పోలీసు శాఖ అధికారిక వెబ్సైట్ https://echallan.tspolice.gov.in/publicview/ను చూడాలని లేదా 040-27852772, 27852721 నంబర్లను సంప్రదించాలని సూచించారు.