సిటీబ్యూరో, ఫిబ్రవరి 13(నమస్తే తెలంగాణ): నిబంధనలకు విరుద్ధంగా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌పై అధికారులు, సిబ్బంది ప్రత్యేక దృష్టి పెట్టాలని రంగారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ పి.దశరథ్ అన్నారు. నాంపల్లిలోని అబ్కారీ భవన్లో గురువారం జరిగిన రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం వల్ల రాష్ట్ర ఖజానాకు గండిపడుతుందని, దీనిని అరికట్టినప్పుడే మన వద్ద లిక్కర్ సేల్స్ పెరుగుతాయన్నారు. ఎన్డీపీఎల్తో పాటు డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై కూడా నిఘా పెంచాలని సూచించారు. ఆయా ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో పట్టుబడి, నిల్వ ఉన్న గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలను వెంటనే డిస్పోజల్ కమిటీ అనుమతి తీసుకుని దహనం చేయాలన్నారు.
అంతే కాకుండా జిల్లా పరిధిలోని పల్లు ఎక్సైజ్ స్టేషన్లలో పేరుకుపోయిన వాహనాలను సైతం సం బంధిత యజమానులకు నోటీసులు ఇచ్చి, వే లం పెట్టాలన్నారు. గడిచిన నెల రోజుల్లో రంగారెడ్డి ఎక్సైజ్ డివిజన్ వ్యాప్తంగా అబ్కారీ నేరాలకు సంబంధించి మొత్తం 197 కేసులు నమోదవగా, 149 మందిని అరెస్టు చేశామని, 7,904 కిలోల బెల్లం, 40 కిలోల అల్లం, 81.72 కిలోల గంజాయి, ఇతర డ్రగ్స్‌ను పట్టుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సిబ్బంది పనితీరును డీసీ అభినందించారు. సమావేశం లో అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, శంషాబా ద్, సరూర్‌నగర్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్లు కృష్ణప్రి య, ఉజ్వలారెడ్డి, ఫయాజుద్దీన్, నవీన్, విజయ భాస్కర్లతో పాటు ఏఈఎస్, ఎస్హెచ్ఓలు, ఎస్ఐ స్థాయి అధికారులు పాల్గొన్నారు.