Online Betting | సిటీబ్యూరో, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్ బెట్టింగ్‌లు కొందరు యువత పాలిట ఉరితాడుగా మారుతున్నాయి. సులువుగా డబ్బు సంపాదించాలనే ఆశతో చాలా మంది ఈ జూదం ఉచ్చులో కూరుకుపోయి, చివరకు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆన్లైన్, ఆఫ్‌లైన్ గ్యాంబ్లింగ్ ఆటలను నిషేధిస్తూ 2017లోనే చట్టం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. ఈ చట్టం ప్రకారం ఆన్లైన్లో జూదం నిర్వహించడం, ఆడటం కూడా నేరమే. అయినప్పటికీ నిఘా వైఫల్యమో లేకా కొందరి ప్రత్యేక ఒప్పందాలో తెలియదు కాని రాష్ట్రంలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లు పుట్టగొడుగుల్లానే పుట్టుకొస్తున్నాయి.
జోరుగానే జూదం కీడ్రలు సాగుతున్నాయి. ఆన్లైన్ బెట్టింగ్‌లకు అలవాటు పడ్డ చాలమంది యువత తల్లిదండ్రులు కష్టపడి సంపాదించిన సొమ్మును ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్ల ఖాతాలకు పంపిస్తున్నారు. అక్రమ పద్దతిలో నడుస్తున్న ఈ ఆన్లైన్ బెట్టింగ్ గేమ్‌లలో నిర్వాహకులు ఏఐ సహకారాన్ని తీసుకుంటూ కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేస్తున్నట్లు సమాచారం. అమాయకులకు వల వేసి భారీగా సంపాదిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్ రాయుళ్లు ఈ గేమ్స్‌ను ప్రమోట్ చేయడానికి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ను వాడుకుంటున్నారు. అందుకోసం భారీగానే వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది. రమ్మీ లాంటి ఆన్లైన్ బెట్టింగ్‌లలో పెట్టుబడులు పెట్టి మోసపోయిన వారు ఆ షాక్ నుంచి కోలుకోక, బయట మొఖం చూపించలేక బలవన్మరణాలకు పాల్పడ్ఢ ఘటనలు రాష్ట్రం వ్యాప్తంగా తరుచు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మోహన్ అరవింద్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్‌లో రూ.2లక్షలు పోగొట్టుకుని మాదాపూర్‌లోని ఖానామెట్‌లో ఈనెల 17న ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే.
జిమ్మిక్కులు చేస్తూ…!
ఆన్లైన్ రమ్మీ, ఇతర గ్యాంబ్లింగ్ ఆటలోకి కస్టమర్లను ఆకర్షించేందుకు వివిధ వెబ్సైట్లు ఇంటర్నెట్లో భారీ ప్రకటనలిస్తుంటాయి. దానికి తోడు తమ వెబ్సైట్లో సభ్యత్వం తీసుకుంటే బంపర్ ఆఫరిస్తామంటూ బుట్టలో పడేస్తున్నారు. ఆట ప్రారంభంలో డబ్బులు ఇచ్చినట్లే చేసి, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటపై వినియోగదారులకు మోజు పెంచుతున్నారు. ఇది వ్యసనంగా మారడంతో ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆటల నుంచి బయటకు రాని పరిస్ధితిలో చాలమంది ఉంటున్నారు. ఏ సభ్యుడు రోజు ఎంత సేపు ఆడుతున్నాడనే విషయాన్ని గుర్తిస్తూ, ఆన్లైన్ సైట్ నిర్వాహకులు వారి దృష్టంతా ఆటపై ఉండేందుకు జిమ్మిక్కులు చేస్తుంటారు.
మొదట రమ్మీ, ఇతర బెట్టింగ్ ఆటలు ఆడిన వారికి గెలిచేందుకు కొంత అవకాశమిస్తారు, ఆ తరువాత వారికి ఆటను ఆలవాటు చేసి ఇక ఆశలో వారిని ముంచేస్తుంటారు. పది సార్లు పెట్టుబడి బడితే అందులో 8 సార్లు నష్టపోవడం, రెండు సార్లు లాభం వచ్చినట్లు చూపించే లాజిక్స్‌ను బ్యాకెండ్ నుంచి గ్యాంబ్లింగ్ ఆట నిర్వాహకులు చేస్తుంటారు. ఇలాంటి గ్యాంబ్లింగ్ ఆటపై గతంలో హైదరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. కలర్ ప్రిడిక్షన్ గేమ్‌ను గతంలో ఉక్కుపాదంతో అణిచివేశారు. ఈ గేమ్‌లో నష్టపోయిన వారు ఆత్మహత్మలు చేసుకుంటుండడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వేగంగా పోలీసులు స్పందించి మూలాల వరకు వెళ్లి ఆన్లైన్లో జరిగిన స్కామ్‌ను వెలుగులోకి తెచ్చి దేశ వ్యాప్తంగా నిర్వాహకులను పట్టుకున్నారు.
మార్కెటింగ్ చేస్తున్న ఇన్‌ప్లూయెన్సర్లు..!
సోషల్‌మీడియాలో ఇన్ప్లూయెన్సర్స్ ప్రభావం నేడు సామాన్య ప్రజలపై చాల ఉంటుంది. ఈ నేపధ్యంలో పలు వ్యాపార సంస్తలు తమ వ్యాపారాభివృద్దికి ఇన్ప్లూయెన్సర్తో ప్రకటనలు ఇప్పిస్తున్నారు. సాధారణంగా వ్యాపార ప్రకటనలు ఇస్తే తక్కువ మొత్తంలోనే ఆదాయం ఉంటు ంది. అదే నిషేధిత ఆన్లైన్ బెట్టింగ్ యాప్‌లను మార్కెటింగ్ చేస్తే భారీగా ఆదాయం ఉంటుంది. ఈ నేపధ్యంలోనే పలువురు ఇన్ప్లూయెన్సర్స్ ఆన్లైన్ బెట్టింగ్‌కు సంబంధించిన లింక్‌లు తమ సోషల్‌మీడియా ఖాతా ద్వారా తమ ఫాలోవర్స్‌కు చేరే విధంగా మార్కెటింగ్ చేస్తున్నారు. కొందరికి లక్షల్లో వ్యూవర్స్ ఉంటున్నారు.
అందులో కనీసం 10 శాతం మంది అయినా ఆ లింక్‌ను క్లిక్ చేయడంతో బెట్టింగ్ యాప్‌లకు భారీగానే ఆదాయం వస్తుంది, అందులో కొందరు కమిషన్లు తీసుకుంటూ మరింతగా ప్రమోట్ చేస్తున్నారు. ఆన్లైన్ బెట్టింగ్స్ ఇతర రాష్ర్టాలు, దేశాల వేదికగానే కొనసాగుతున్నాయి. బెట్టింగ్ యాప్‌లకు ప్రమోషన్స్ ఇస్తూ కొంత మంది సోషల్‌మీడియా ఇన్ప్లూయెన్సర్స్ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇలా సంపాదించిన మనీని విచ్చలవిడిగా కష్టపెడుతూ తాము స్వచ్చంగా సంపాదించామనే బిల్డఫ్ ఇస్తుంటారు. అయితే పోలీసులు ఈ బెట్టింగ్ యాప్‌ల నిర్వాహకులు, ఇన్ఫ్లూయెన్సర్ప్పై లోతైనా దర్యాప్తు జరిపితే ఎన్నో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయి.