Hyderabad | సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ): మహాప్రస్థానం తరహాలో రూపుదిద్దుకున్న పంజాగుట్ట హిందూ శ్మశాన వాటికను ఈ నెల 25న ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. శుక్రవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, స్థానిక కార్పొరేటర్ మన్నె కవితా రెడ్డి, జోనల్ కమిషనర్ వెంకటేశ్‌తో కలిసి పంజాగుట్ట శ్మశాన వాటికను పరిశీలించారు. సుమారు ఐదు కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులు మంత్రి తలసాని, మేయర్ గద్వాల్ విజయలక్ష్మికి వివరించారు.
సుమారు 12 ఎకరాల విస్తీర్ణంలో పంజాగుట్ట శ్మశాన వాటికను మహాప్రస్థానం కంటే గొప్పగా వైకుంఠధామంగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తలసాని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రూ.1.90 కోట్లతో రోడ్ల నిర్మాణం, ప్రహరీ, పచ్చదనం పెంపు పనులు చేపట్టగా.. ఫీనిక్స్ సంస్థ ఆధ్వర్యంలో సీఎస్ఆర్ కింద రూ. 3 కోట్లతో అత్యాధునికమైన దహన సంస్కారాలు నిర్వహించే ప్లాట్ ఫాంలు, అస్తికలను భద్రపరిచేందుకు లాకర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ఇక్కడకు వచ్చే వారు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు మంత్రి తలసాని తెలిపారు. అలాగే ప్రశాంతమైన వాతావరణం కల్పించే విధంగా పచ్చదనం పెంపు, కూర్చునేందుకు వీలుగా వసతి గదులు, మరుగుదొడ్ల నిర్మాణం తదితర సౌకర్యాలను కల్పించామన్నారు. పెండింగ్‌లో ఉన్న పనులను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఈఎస్ఐ గ్రేవ్‌యార్డు అభివృద్ధి పనులను కూడా త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
మంత్రి కేటీఆర్ సారథ్యంలో హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి సాధించిందని, ఎస్ఎన్డీపీతో వరద ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి తెలిపారు. గ్రేవ్‌యార్డులో సకల సదుపాయాలతో పాటు ఆహ్లాదకర వాతావరణం కల్పించినట్లు మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీ ప్రశాంతి, ఎస్ఈ రత్నాకర్, ఈఈ విజయ్‌కుమార్, వాటర్‌వర్క్స్ జీఎం హరిశంకర్, హార్టికల్చర్ డీడీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.