హిమాయత్‌నగర్, మార్చి10: ఇంటీరియర్ డిజైనర్ చేస్తానని నమ్మిస్తూ మోసాలకు పాల్పడుతున్న కేట్గాడిని నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం నారాయణగూడ పీఎస్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఈస్ట్‌జోన్ అడిషనల్ డీసీపీ జె.నర్సయ్య, సుల్తాన్ బజార్ ఏసీపీ శంకర్, ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, డీఎస్సై వెంకటేశ్‌తో కలిసి ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి కేసు వివరాలను వెల్లడించారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన పలాష్ పాల్(46) నగరానికి జీవనోపాధి కోసం వచ్చి జవహర్‌నగర్‌లో అద్దెకుంటున్నాడు. పలాష్ పాల్ చెడు వ్యసనాలకు అలవాటు పడటంతో డబ్బులు సంపాదించాలని వక్రమార్గాన్ని ఎంచుకున్నాడు.
ఇంటీరియర్ డిజైనర్‌నంటూ ఇంటి యజమానులను, బిల్డర్స్‌ను సంప్రదించి డిజైన్స్‌కు సంబంధించిన నకిలీ వీడియోలను చూపించి మాయమాటలతో వారిని బుట్టలో వేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో ఇటీవల బషీర్‌బాగ్, అవంతినగర్‌లో నివాసం ఉండే ఎం.నిఖిత్ రెడ్డి ఇంటి నిర్మాణం చేస్తుండగా పలాష్ పాల్ అతనిని సంప్రదించి ఇంటీరియర్ డిజైన్, వుడ్ వర్క్స్ చేస్తానని నమ్మించాడు. మెటిరియల్ తీసుకువస్తానని చెప్పి రూ.66 లక్షలు తీసుకుని మొహం చాటేయగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో క్రైం పోలీసులు నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
అంతేకాకుండాఎస్ఆర్నగర్ పీస్ పరిధిలో జరిగిన ఓ మర్డర్ కేసులో పలాష్ పాల్ పై కేసు నమోదు కాగా అతని కోర్ట్ పేషీలకు సైతం హాజరుకాక పోవడంతో ఎన్ బీడబ్ల్యూ వారెంట్‌ను న్యాయస్థానం జారీ చేసింది. ఇదే తరహా మోసాలకు పాల్పడటంతో శంషాబాద్,రాయదుర్గం పోలీస్స్టేషన్లలో సైతం పలాష్ పాల్‌పై కేసులు నమోదయ్యాయి. వెంగళ్రావునగర్లో పలాష్ పాల్ ఉన్నట్లు గుర్తించి అతనిని అదుపులోకి తీసుకుని విచారించగా చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. దీంతో పలాష్‌పాల్ అకౌంట్లో ఉన్న రూ. 18,65,000 నగదును ఫ్రీజ్ చేయడంతో పాటు అతని వద్ద రూ.10 లక్షల విలువైన 120 గ్రాముల బంగారం, రూ.40 వేల నగదు, ఒక హోండా యాక్టివా, పలు ల్యాండ్ రిజిస్టేష్రన్ డాక్యుమెంట్స్, 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసులో పురోగతి సాధించినందుకు డీసీపీ బాలస్వామి సీఐ చంద్రశేఖర్,డీఎస్సై వెంకటేశ్,కానిస్టేబుళ్లు అభిలాష్, సురేష్‌కు నగదు రివార్డును అందజేశారు.